"పురుషద్వేషిణి"
పూర్వం విజయుడనే రాజుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమె చాలా చిన్న పిల్లగా ఉండగా ఆమె దాది రోజూ ఒక కథ చెప్పేది. ఆ కథ ఏమంటే—
'అనగనగా ఒక అరణ్యంలో ఒక అడవిపావురాల జంట ఉండేది. లేకలేక వాటికి నాలుగు పిల్లలు పుట్టాయి. ఒకనాడు అరణ్యంలో కార్చిచ్చు బయలుదేరి, ఇంకా ఎగరలేని స్థితిలో ఉన్న ఆ పిల్లలను దహించివేసింది. ఇది చూసి ఆడపావురం చాలా దుఃఖించింది. 'నా పిల్లలుపోయాక నేను మాత్రం బతకటం దేనికి? ఆ మంటల్లోనే పడి ఆత్మహత్య చేసుకుంటాను' అన్నది.
"మగపావురం తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని బయలుదేరింది. కాని సగం దారిలో అది, ' మనం ఆత్మహత్య చేసుకోవద్దు, మనం ఉంటే ఇంకా పిల్లలు
కలగవచ్చు. మనమే పోతే ఇంకేముంది?' అన్నది.
‘'ఛీ ! నీకు పిల్లలుపోయిన విచారమే లేదు. నేను నీ మాట వినను." అంటూ ఆడపావురం వొంటరిగా వెళ్ళి మంటల్లో పడి చచ్చిపోయింది. లోకంలో ఎవరి నన్నా నమ్మవచ్చుగాని మగవాళ్ళను నమ్మకూడదు!''
ఈ కథ విని రాజకుమార్తె దాదిని, "చచ్చిపోయిన ఆడ పావురంఏమయింది?" అని అడిగేది.
దాది నవ్వుతూ. " ఆ పావురమే మా రాజుగారి కడుపున ఇలా పుట్టింది." అని రాజకుమార్తెను ముద్దులాడేది.
కొద్దికాలానికి ఆ దాది చనిపోయింది. కాని రాజకుమార్తె, దాది చెప్పిన అడవి పావురాల కథా, మగవారిని నమ్మరాదనే నీతీ మాత్రం మరిచిపోలేదు.
రత్నావళి ఒకనాడు తండ్రితో, "నాన్నా, నా కోసం తోటలో ప్రత్యేకంగా కుటీరం కట్టించు. అందులో నేనూ, నా చెలికత్తెలూ మాత్రం ఉంటాం. అటుకేసి మగపురుగెవరూ రాకుండా కట్టుదిట్టం చేయించు," అన్నది.
''ఇదేమిటి? నేడో రేపో నీ పెళ్లి చేద్దామనుకుంటున్నామే?" అన్నాడు తండ్రి.
''ఈ జన్మలో కాదుగదా, వెయ్యి జన్మ లెత్తినా నేను పెళ్లాడేది కల్ల!" అని చెప్పింది రత్నావళి.
కొంతకాలం గడిచింది. దూరదేశం నుంచి ఒక రాజు కొడుకూ, మంత్రి కొడుకూ వచ్చారు. రత్నావళి ఉండే కుటీరం చుట్టూ ఉన్న తోటను చూసి, అక్కడ కాస్సేపు విశ్రాంతి తీసుకుని ముందుకు పోదామని అందులో ప్రవే శించారు.
వారు తోటలోకి అడుగు పెట్టిన క్షణంలోనే, ''పొండి, పొండి! ఇక్కడ పురుషులు అడుగు పెట్టరాదు. మీరు పరదేశీయుల్లాగా ఉన్నారు. ఇది మా రాజ కుమార్తె రత్నావళీదేవి కుటీరం. ఇకడికి పోతుటీగ వచ్చినా మా రాజుగారు తీవ్రంగా దండిస్తారు,'' అంటూ ఒక దాసీది అరుచుకుంటూ అక్కడికి వచ్చింది.
"మేమేం మీ రత్నావళిని ఎత్తుకు పోతామా?" అన్నాడు రాజకుమారుడు. ' "మా దేవిగారికి పురుషుల పొడ కూడా గిట్టదు. తెలిసిందా? వేగిరం వేంచెయ్యండి." అన్నది దాసీది.
ఇద్దరూ తోట లోపలి నుంచి బయటికి వచ్చేశారు.
"మిత్రమా, ఈ పురుషద్వేషిణిని పెళ్లాడి తీరాలని నా అంతరాత్మ చెబుతున్నది. ఏమిటి సాధనం?'' అన్నాడు. రాజకుమారుడు.
"అసలామె ఎంత అనాకారి మనిషో? నేను విచారించి చూస్తాలే", అన్నాడు మంత్రికుమారుడు.
ఇద్దరూ నేరుగా నగరానికి వెళ్లి పేదరాసి పెద్దమ్మ ఇంట బస ఏర్పరచుకున్నారు.
అవ్వా, మీ రాజు కూతురికి పురుష ద్వేషంట! కురూపి కాదుగద?" అన్నాడు, మంత్రికుమారుడు.
"మా రత్నావళి చక్కనిచుక్క'' అన్నది పెద్దమ్మ.
అయితే, ఈ పురుష ద్వేషానికి కారణం?" అని అడిగాడు మంత్రి కుమారుడు.
''ఈ సంగతి మళ్లీ ఎక్కడా అనకండి, బాబూ! పరమ రహస్యం. రత్నావళి కిందటి జన్మలో ఆడపావురం. పెట్టక పెట్టక పిల్లల్ని పెడితే అగ్నిదేవుడు పొట్టన పెట్టుకున్నాడు. ఆడపావురమూ, మగ పావురమూ కలిసి ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాయి. ఆఖరు క్షణంలో మగ పావురం ఎటో తప్పించుకు పారిపోయింది. ఆడపావురం మంటల్లో పడి చనిపోయి, మా రాజు కడుపున పుట్టింది.'' అన్నది పేదరాసి పెద్దమ్మ.
"ఈ రహస్యం ఎవరు కనిపెట్టారవ్వా?" అని అడిగాడు మంత్రికొడుకు.
" అయ్యొ, నాయనా ! రత్నావళికి పూర్వజన్మ జ్ఞానం ఉంది" అన్నది అవ్వ.
"ఓహెూ, అలాగా?" అంటూ మంత్రి కుమారుడు కర్తవ్యం ఆలోచించాడు.
మర్నాడు తెల్లవారుతూనే రాజు కొడుకూ, మంత్రికొడుకూ పేదరాసి పెద్దమ్మ దగ్గిర సెలవు పుచ్చుకుని బయలుదేరారు. వారు ఊరి బయటి దాకా వెళ్ళి అక్కడ వేషాలు మార్చుకుని తిరిగి వచ్చారు. రాజుగారి ఆస్థానానికి నేరుగా వెళ్ళారు.
''మీరెవరు ? ఏ దేశంవారు?' అని రాజు మామూలు ప్రశ్నలు వేశాడు.
"మహారాజా, మాది నేపాళం. వీరు నా గురువుగారు. ఇంద్రజాలంలో ప్రపంచంలో వీరికి సాటి ఎవరూ లేరు. వీరు జలస్తంభన, వాయుస్తంభన, అగ్నిస్తంభన వగైరా విద్యలన్నీ చూపిస్తారు. ఎడారిలో మహారణ్యాలు పుట్టిస్తారు. ఎండిపోయిన చెట్లమీద పళ్లు పండిస్తారు. తమరు మెచ్చి తగిన బహుమానం ఇవ్వాలి." అన్నాడు మంత్రికుమారుడు.
''మంచిది. ఈ ప్రదర్శనాన్ని తోటలో వున్న కుటీరం వద్ద ఏర్పాటు చేస్తాం. మా అమ్మాయి కూడా చూస్తుంది." అన్నాడు రాజు.
మంత్రికుమారుడు ఆందోళన అభినయిస్తూ, '' మహారాజా, వద్దు! మా గురువుగారు స్త్రీ ద్వేషి, ఆడవారిని చూడరు. మీ బహుమానం లేకపోయినా మానె, వ్రతభంగం కావటానికి ఎంత మాత్రం వీలులేదు." అన్నాడు.
" ఓహెూ, అలాగా? పోనీ, స్త్రీ జనం రహస్యంగా కూచుని అయినా ప్రదర్శనం చూడవచ్చునా?'' అన్నాడు రాజు.
'వారు కనిపించరాదు, వారి గొంతు వినిపించరాదు." అన్నాడు మంత్రి కుమారుడు.
ఆ ప్రకారమే ఏర్పాట్లు జరిగాయి. తోటలోని ఆవరణలో స్త్రీలకు ప్రత్యేక స్థలం ఏర్పాటుచేసి, స్త్రీలు కనిపించకుండా తెరలు కట్టారు.
ఇంద్రజాలం ప్రారంభించటానికి రాజు కొడుకు లేచి నిలబడి ఇలా చెప్పసాగాడు:
"నా విద్యలను స్త్రీలు సరిగా చూడ లేకపోతే ఏలినవారు నన్ను మన్నించాలి. నాకు గల స్త్రీద్వేషానికి కారణం చెబుతాను. నాకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నది. నేను కిందటి జన్మలో ఒక అడవి పావురాన్ని నేనూ, నా భార్యా ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం. మాకు లేక లేక పిల్లలు కలిగితే అగ్నిదేవుడు వాటిని పొట్టన పెట్టుకున్నాడు. నేనూ, నా భార్యా ఆత్మహత్య చేసుకుందామనుకున్నాం.
ఆఖరు క్షణంలో నా భార్య ఎటో వెళ్ళి పోయింది. నేను మాత్రం స్త్రీలను ఏ జన్మలోనూ నమ్మరాదనుకుంటూ అగ్నిలో పడి ప్రాణాలర్పించి, ఆ పుణ్యం ఫలితంగా ఈ జన్మలో ఇంద్రజాల విద్యతో పుట్టాను. జన్మ జన్మాలకూ నా భార్యకు వివాహం ఉండదు. ఇదే ఆమెకు నా శాపం! నేను కూడా స్త్రీని ద్వేషిస్తాను.''
ఇదంతా వింటున్న రత్నావళి, తెర తోసుకుని ముందుకు వచ్చి, "అబద్ధం, పచ్చి అబద్ధం! సంతాన శోకంతో మరణించింది నేను! నువే ఎటో ఎగిరి పోయావు!'' అన్నది.
"నేనా? నేను మరుక్షణమే మంటలలో పడిపోయాను. నన్ను మోసగించినది నువ్వే!" అన్నాడు రాజకుమారుడు.
మనం బతికుంటే మళ్ళీ పిల్లలు పుడతారన్నావు. నువే మోసగాడివి." అన్నది రాజు కూతురు.
''నీ దీక్ష పరీక్షించటానికలా అన్నాను గాని, భగవంతుడికి పిల్లల నివ్వాలనే ఉంటే కలిగిన పిల్లలను మంటల పాలు చేస్తాడా? నువే మోసగత్తెవు! నేనా మాట అనగానే నువు మరొక దిక్కుగా పారిపోయి ప్రాణం రక్షించుకున్నావు.'' అన్నాడు రాజుకొడుకు కోపం నటిస్తూ.
''అయిందేదో అయిపోయింది! గురూ, మీరు మీ భార్యను క్షమించి ఏలుకోండి. మిమ్మల్ని ఆ పరమేశ్వరుడే కలిపాడని మేమంతా అనుకుంటున్నాం.'' అన్నాడు మంత్రికుమారుడు.
రాజకుమారుడు ప్రసన్నుడై రత్నావళిని సమీపించి, "నేను నీకు అన్యాయం చేసివుంటే క్షమించు. నువు మంటలలో దూకలేదనుకున్నాను." అన్నాడు.
"నేనే పాపిష్టి దాన్ని! నన్ను చావనిచ్చి మీరు తప్పించుకు పోయారనుకున్నాను. నన్నే మీరు క్షమించాలి.'' అన్నది రత్నావళి.
చివరకు రాజకుమారుడు చేసిన ఇంద్రజాలం రత్నావళి యొక్క పురుష ద్వేషాన్ని పోగొట్టటమే! ఇందుకు బహుమానంగా రాజు అతనికి రత్నావళి నిచ్చి ఒక శుభముహూర్తాన వైభవంగా పెళ్ళి చేసేశాడు.
No comments:
Post a Comment