తండ్రి మాటలు జవదాటని శ్రీరాముడు దేవుడు అయ్యాడు, తండ్రి మాట వినని ప్రహ్లాదుడు కూడా మాహానుభావుడు అయ్యాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
నిజమే.
మాతృదేవోభవ. .పితృదేవో భవ. అని వేదమే చెప్పింది.
తల్లి చెప్పినపని చేయక నాగులు ప్రాణం మీదికి తెచ్చుకొన్నారు. జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చావండి అన్నది — ఆ తల్లి తన కన్నబిడ్డలను.
తప్పైనా ఒప్పైనా మాటంటే మాట. కడుపున పుట్టిన కారణాన వినవలసిందే. తప్పదు.
ఇక్కడ ఒక మెలిక ఉంది. "ఇది అన్యాయం. వీళ్ళేమి తప్పు చేశారు. సత్యానికి కట్టుబడ్డారు. అందువల్లే కదా తల్లిమాటను కాదన్నారు. ధర్మం పాటించారు " అని అనిపించినా—
"తమ విషానికి అడ్డులేదని అహంకరించి లోకపీడకులౌతారు వీళ్ళు. ఈ శాపం వీళ్ళకు సముచితమే —అని బ్రహ్మ దేవుడు ఆ తల్లి శాపానికి అధికారముద్ర వేసి ' అది తగును' అని తన పని తేలిక చేసుకొన్నాడు.
అందువల్ల అక్కడ అనుచితమైన ఆ తల్లిశాపం ఫలించింది.. వట్టి కద్రువ మాట వల్లే కాలేదు.
భీష్ముడున్నాడు.
తన ప్రారబ్ధం వల్లనో, ఏమో పరిస్థితులు అట్లా వచ్చాయి. అడగకపోయినా శంతనుడి కోసం (తండ్రి కోసం) ఒక శపథం పట్టాడు. జీవితాంతం దాన్ని నిలుపుకొన్నాడు. దేవవ్రతుడు కాస్తా భీష్ముడు అని గగనమంతా మ్రోసింది.
గురువు పరశురాముడు అంబ వచ్చి తనను ఆశ్రయించబట్టి " ఆ భీష్ముడి వల్ల నీకీ విపత్తు వచ్చింది ..అతణ్ణి శిక్షించవలసిందే"— అని అంతటి లోకైకవీరుడు శస్త్రం పట్టాడు ప్రియశిష్యుడిపైన.
తన వైపు ధర్మం ఉంది.
22 రోజులు తన అస్త్రగురువే యుద్ధం చేసినా, ఏమీ చలించడాయన. కడకు దేవతలే దిగివచ్చి యుద్ధం ఆపారు గానీ , గురువుగారే… ఆచార్యదేవో భవ అని చెప్పారు గదా! అని ఆ భీష్ముడు వెనకడుగు వేయలేదు.
ఈ కథలలో సారం.. పాటించే ధర్మం నిస్వార్థంగా ఉండాలి. శాశ్వత ధర్మాలను నిలిపేదిగా ఉండాలి ఆ ప్రవర్తన. ఎవరినో తృప్తిపరచడానికి చేసేదిగా ఉండగూడదు.
దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు( కైకమ్మ రాముడితో అన్న మాటకు మౌనంగా ఉండిపోవడం ద్వారా )
అపుడే తల్లి కౌసల్య ధర్మం ఎరిగీ , "పుత్రమోహంతో నేను చెప్తున్నా. పోవద్దు" అన్నది రాముణ్ణి.
ఇక్కడ తల్లిమాట —తండ్రిమాట రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.
రాముడు తండ్రి దశరథుడు కైకకు ఇచ్చిన మాట ఒక పుత్రుడుగా చేసి, ఆయన్ను సత్యవాక్యుణ్ణి చేయదలపెట్టాడు.
తాను మనిషిగా "దశరథుడు చేసినది ధర్మమా? అధర్మమా?" అని చూడలేదు.
తండ్రి. అతడికి సత్యలోకం లభించాలి. ఆయన ఇచ్చిన వరం నెరవేరితేనే అది సాధ్యం.
పుత్రధర్మం[ పుత్రేణ లోకాన్ జయతి ]గా తాను చేయడం ..తన విధి— అని అది పాటించాడు. ఇక్కడ తల్లి స్వార్థాన్ని జయించాడు.
రాముడు దేవుడు కాదు * ఉత్తమ మానవుడైనాడు* ఈ పనిచేసి.
ప్రహ్లాదుడూ పితృభక్తిలో తక్కువ చేయలేదు.
"ఈ తండ్రిని చంపేసి నన్ను కాపాడు" అని అన్ని కష్టాలలోనూ దేవుణ్ణి కోరలేదు.
తండ్రి మాటమీద ఆ గురువులు ఏ చదువులు ( అవి మిధ్యలని తెలిసీ) చెప్పినా అవి అలాగే చదివాడు. ఇట్టట్టని ఆక్షేపించడు. అలా తండ్రి మాటా పాటించాడు.
తండ్రి సుజ్ఞాని . కానీ, మోహం కమ్మింది. తన తమ్ముడు హిరణ్యాక్షుడు తప్పుచేసే శిక్షింపబడ్డాడు — అని తెలిసినా నా తమ్ముణ్ణి చంపుతాడా? అని విరోధం పూనాడు.
తాను, తనవాళ్ళూ ఎవరూ ఆ విష్ణువును తలపగూడదు —అని శాసించాడు. "ఆ విష్ణువు మన వైరి" అంటాడు. అంటే ఆయనొకడున్నాడనీ బలవంతుడనీ బాగా తెలుసు గానీ ఒప్పుకోలేక పోతున్నాడు.
నన్ను చూచి భయపడిపోయాడు. అందుకే కనబడడు. నేనే బలవంతుణ్ణి. నేనే సర్వశక్తిమంతుణ్ణి అని అహంకారం తలకెక్కింది.
తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు కొడుకు. సర్వమున్ అతని దివ్యకళామయము . తపస్సు చేసుకోవడమే సర్వోత్తమం అని చెప్పాడు.
విష్ణువు " అతడు అతిసౌమ్యుడు, సుజనుడు ఐన కొడుకుమీద పగ బూనినపుడే వధిస్తాను" అని దేవతలకు మాట ఇచ్చాడు.
"ఇందుగలడందులేడని సందేహము వలదు. ఎందెందు వెదకి చూచిన అందిందే కలడు" అని ఆత్మనిష్ఠుణ్ణి కమ్మన్నాడు కొడుకు.
ఆ తండ్రి లోపల వెదకడం ఎపుడో మరచిపోయాడు అహంకారం ముదిరి. కొడుకు * విష్ణుడింతియ కాక వేరొండు లేడ*ని ఒత్తిలి (నవ్వు కనబడకుండా నోరు చేతితో మూసుకొని) నవ్వుకుంటున్నాడు. తండ్రి బయట కళ్ళు మూసుకొని వెతుకుతున్నాడు. ఇదీ తేడా.
రాముడు తండ్రికి సౌమ్యంగా సద్గతి కలిగించాడు. దశరథుడి గుణానికి అది సాధ్యం అయింది.
హిరణ్యకశిపుడు దౌష్ట్యం శాపంతో అనుభవిస్తున్నాడు.
ఈ పుత్రుడు మంత్ర ఉపాసన చేసి చేసి తండ్రికి ఆ తొలి జన్మ నుండి విముక్తి కలిగించాడు.
*పుత్రేణ లోకాన్ జయతి* అని ఆ తండ్రికి తెలిసేట్టు చేశాడు అకర్త అయి.
No comments:
Post a Comment