రామాయణం పఠించేటప్పుడు ప్రజలు హనుమంతుని కోసం ఒక ఆసనాన్ని ఎందుకు ఖాళీగా ఉంచుతారు మరియు ఈ సంప్రదాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
యత్ర యత్ర రఘునాథకీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్ “
“ ఎక్కడ రాముని స్తుతి/కీర్తన పాడబడుతుందో, అక్కడ రాక్షస సంహారి అయిన హనుమంతుడు భక్తితో శిరస్సు వంచి, ఆనంద భాష్పాలతో కూర్చుని ఉంటారు " అని.
రామ భజన (కీర్తన) జరిగే చోట హనుమంతుడు ఎల్లప్పుడూ చేతులు జోడించి, కన్నీళ్లతో వచ్చి కూర్చుంటారని నమ్మకం. అందుకే హనుమంతుని గౌరవార్థం, భజన/పారాయణం ప్రారంభించే ముందు ఆయన కోసం ఒక ఆసనం ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచుతారు.
తులసీదాస్ రామాయణం రాస్తున్నప్పుడు హనుమ ప్రక్కన కూర్చుని ఉండేవారుట. అతని పక్కన కూర్చుని సలహాలు ఇచ్చేవారుట.
అసలు, రామభజన జరిగేచోటే వచ్చి కూర్చుంటారు హనుమ. అలాంటప్పుడు రామాయణం రాస్తూన్నప్పుడు వచ్చి కూర్చోకుండా ఎలా ఉంటారు.
లంకలోని అశోక వనం గురించి రాస్తూన్నప్పుడు, తులసీదాసు అశోక పుష్పాలను తెల్లగా వర్ణించాడు. అప్పుడు హనుమంతుడు, " అవి తెల్లగా ఉన్నాయని ఎందుకు రాస్తున్నావు? అవి నిజానికి ఎర్రగా ఉన్నాయి కదా " అన్నారు. దానికి తులసీదాసు, " కానీ నాకు తెల్లగా కనిపిస్తున్నాయి కదా "—అని తన అంతర్దృష్టిని ఉద్దేశించి చెప్పాడు. దానికి హనుమ " నేను వాటిని నేరుగా చూశాను మరి " అన్నారు.
ఈ సందేహాన్ని ఎవరు నివృత్తి చేయగలరు? సీతామాత అక్కడ చాలా కాలం గడిపినందున, వారు ఆమెను అడగాలని నిర్ణయించుకుని, "అమ్మా!" అని పిలిచారు.
సీతామాతతో పాటు శ్రీరాముడు కూడా అక్కడికి చేరుకుని, "ఎందుకు పిలిచారు?" అని అడిగారు. వారు తమ సందిగ్ధతను వివరించారు. రాముడు, " హనుమా, ఆ పుష్పాలు నిజంగా తెల్లగానే ఉన్నాయి. అయితే, ఆ సమయంలో సీతామాత కనిపించకపోవడంతో నువ్వు తీవ్రమైన కోపంతో, ఆందోళనతో రగిలిపోతున్నావు; నీ కళ్ళు ఎర్రబడి, రక్తవర్ణంలోకి మారాయి. కేవలం ఆ కారణంగానే అవి అప్పుడు నీకు ఎర్రగా కనిపించాయి " అని తెలియచేసారుట.
No comments:
Post a Comment