స్పర్శలు లేవు, పలకరింపులు లేవు.
ఫోన్లు, ఈమెయిళ్ళు తప్ప హృదయాలకు హత్తుకొనడాలు, ఖాళీ సమయాలు అసలు లేవు.
టి.వి సీరియళ్ళు తప్ప, ఒకరితో ఒకరు కలుసుకొని రెండు కాఫీ కప్పుల మధ్య కల బోసుకోవడాలు, యిచ్చి పుచ్చుకోడాలు, ఆరుబయట చల్లగాలిలో కూచొని స్నేహితులతో, చుట్టాలతో మాటల పరిమళాలతో మనసంతా శీతల పవనాలు నింపుకొని కబుర్లు చెప్పుకోవడాలు లేవు.
ఈ సెల్లు ఫోన్లలో సొల్లు కబుర్లు చెప్పుకోవడాలు తప్ప. యివన్నీ గత జ్ఞాపకాలే. వసంతాలెన్ని (సంవత్సరాలు) వెనక్కు వెళుతున్నకొద్దీ సముద్రంలా విస్తరించాల్సింది పోయి సమూహాన్ని వదిలేసి ఎవరి చితికి వారే నిప్పు పెట్టుకునేంత ఒంటరై పోతున్నాం. కనీసం జ్ఞాపకాల్లో కూడా మిగలకుండా శిధిలమయి నిష్క్రమిస్తున్నాం.
ఆ మధ్య వైజాగ్ లో పెను తుఫాను వచ్చినప్పుడు ఒక పెద్దావిడ పత్రికల వాళ్ళతో ఈ తుఫాను వస్తే వచ్చింది కానీ 10 రోజులు కరెంటు, సెల్ ఫోన్లు, టివీలు, కంప్యూటర్లు లేకుండా హాయిగా సాయింత్రం చీకటి పడకుండానే భోజనము చేసేసి ఆరుబయట కూచుని యిరుగు పొరుగువాళ్ళతో కాస్త మనసు విప్పి కబుర్లు చెప్పుకున్నాం. నాకైతే పూర్వపు రోజులు గుర్తు కొచ్చాయి అని చెప్పిందట.
Suguna Rupanagudi
---------- -------
No comments:
Post a Comment