ముళ్ళపూడి-హాస్యానందం వారు నిర్వహించిన సింగిల్ పేజీ హాస్య కథల పోటీ లో బహుమతి పొందిన కథ:
'సంసార సర్వస్వం.'
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
****
నేనుఆఫీసుకు వెళ్తూ మా 'గేటెడ్ కమ్యూనిటీ' సెక్యూరిటీ రూమ్ గోడకు ఉన్న పెద్ద నోటీసు బోర్డు దగ్గర ఆగాను!
'కమ్యూనిటీ రెసిడెంట్స్' లో కొంతమంది కారు పెట్రోలు ఖర్చు సర్దుబాటు నిమిత్తం, కొంత ఛార్జి తీసుకుని, నెలవారీగా తమ కారులో లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అటువంటి కార్ల వివరాలు నోటీస్ బోర్డులో పెడతారు! మళ్లీ నెల ఒకటో తారీకు నుండి నేను అటువంటి పూల్ కారులో వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది! అందుకని మా కంపెనీ ఉండే ఎలక్ట్రానిక్ సిటీ వైపుకు వెళ్లే ముగ్గురు కారు ఓనర్ల పేర్లు, ప్లాట్ నెంబర్లు , సెల్ నెంబర్లు ఓ కాగితం మీద రాసుకుని ఆఫీస్ కి వచ్చేసాను.
ఆ మూడు కార్ల యజమానుల ముఖాలు తెలుసును కానీ పర్సనల్ వివరాలు, ముఖ్యంగా వారి కార్ల కండిషను ఏమీ తెలియదు. ఆ వివరాలు తెలుసుకోవాలి. ఎలా?! అంతలోనే మిత్రుడు సన్యాసిరావు గుర్తుకొచ్చాడు. వాడు ట్రాక్టర్లు, ట్రక్కులు,లారీలు, కార్లు మొదలైన వాహనాలు కొనేందుకు అప్పుఇచ్చే ఓ పెద్ద ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు!సాలీనా వంద కోట్ల పైచిలుకు టర్నోవర్ తో నడిచే ఆ ఆఫీసు బిల్డింగు, మా ఆఫీస్ పక్కనే ఉంది! వాడికి ఫోన్ చేసి, నా సమస్య చెప్పాను!
వాడు చిన్నగా నవ్వేస్తూ," లోకంలో అన్ని కంప్యూటర్లూ విజ్ఞాన సర్వస్వాలు! కానీ మా ఫైనాన్స్ కంపెనీ ఆఫీసులో కంప్యూటర్లు మాత్రం సంసార సర్వస్వాలు! లంచ్ టైంలో మా ఆఫీస్ కి రా! నీ సమస్య తీరిపోతుంది!" అన్నాడు.
ఒంటిగంటకు బయలుదేరి వాళ్ళ ఆఫీస్ లోని వాడి ఛాంబర్ కి వెళ్ళాను. నేను వెళ్ళగానే కంప్యూటర్ దగ్గర నుండి లేస్తూ," నీకు కావలసిన యాప్ ఓపెన్ లో ఉంచాను! నీకు వివరాలు కావాల్సిన వాళ్ళ పేరు, సెల్ నెంబరు టైప్ చెయ్! వివరం వచ్చేస్తుంది!" అంటూ లేచి, "లంచ్ చేసి వస్తాను!"అంటూ వెళ్ళిపోయాడు.
సావధానంగా కంప్యూటర్ ముందు కూర్చుని నా జేబులోని వివరాల లిస్టు తీసి ఎదరపెట్టుకొని, అందులోని మొదటి పేరు సుజన్ లాల్ అంటూ ఆతని పేరు, ఫోన్ నెంబర్ కూడా టైప్ చేశాను. కొద్ది సెకండ్లలోనే వివరాలు తెరమీద కనబడ్డాయి!
'వీడు బాల నేరస్తుల స్కూల్లో ఏడాది పాటు ఉన్నాడు. వాళ్ళ ఊరి ఎమ్మెల్యే వెనకాల తిరిగి, అనతి కాలంలోనే బాగా డబ్బులు సంపాదించి, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి నడుపుకుంటున్నాడు! వీడి పెళ్ళాం వీడు పెట్టే హింసలు భరించలేక రెండు సంవత్సరాల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది... అంటూ ఇంకా ఏదో రాసుకు పోతోంది!
"అతని కారు కండిషన్ వివరం చెప్పు!" అంటూ టైప్ చేశాను.
'మారుతి డిజైర్ 2016 మోడల్. ఇంతవరకు రెండు యాక్సిడెంట్లు చేశాడు. దీని మీద బ్యాంకులోను ఇంకా 6 లక్షలు ఉంది! వీడి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఏడాదిన్నర అయింది!'అంటూ తెరమీద కనిపించింది.
తర్వాత నా లిస్టులో రెండో పేరు 'రామావతారం .వి' అంటూ అతని పేరు,సెల్ నెంబర్ తో సహా టైప్ చేశాను.
రెండుసెకండ్ల లోనే వివరం తెరమీదకు వచ్చింది!
'బీటెక్ మెకానికల్ మంచి మార్కులు తో పాస్ అయ్యాడు . బ్యాంకు లోన్ సాయంతో సొంతంగా ఎలక్ట్రానిక్ సిటీ శివార్లలో ఓ వర్క్ షాప్ నడుపుతున్నాడు. బ్యాంకు 'లోన్' చాలా వరకు తీర్చేసాడు. సెకండ్ సెట్ అప్ ఉంది. పెళ్ళాంతో నిత్యం గొడవలు పడుతూ ఉంటాడు. వీడి పేరున మూడు కార్లు ఉన్నాయి ఒకటి వాడికి, రెండోది భార్యకి, మూడోది సెకండ్ సెటప్ కి! వీడి కారు 2021 స్విఫ్ట్! మంచి కండిషన్ లో ఉంది!'
తర్వాత నా లిస్టులోని మూడో పేరు, వివరం టైప్ చేసాను!
'ఉత్తి లోఫర్ గాడు! దొంగ నోట్లు చలామణి కేసులో జైలు కెళ్ళి రెండేళ్లు ఉన్నాడు! ఎలక్ట్రానిక్ సిటీలో ఓ కంపెనీలో సీనియర్ క్లర్కుగా ఉద్యోగం వెలగబెడుతున్నాడు! బాగా తాగుతాడు! చిలక్కొట్లు అలవాటు విపరీతంగా ఉంది! వీడి పెళ్ళాం కూడా వీడి లాంటిదే! చీటీ పాటల మీద చాలా డబ్బులు కలెక్ట్ చేసి తినేసింది! కేసులు నడుస్తున్నాయి! ఫైనాన్స్ మీద కారు కొన్నాడు! అది చాలా పూర్ కండిషన్లో ఉంది!'అంటూ వివరాలు వచ్చేసాయి
ఇక చాలు! "థాంక్యూ కంప్యూటర్!"అని అంటూ హుషారుగా నా పేరు, సెల్ నెంబరు టైప్ చేసి పక్కనేనమస్కారం గుర్తుపెట్టాను.
వెంటనే తెరమీద చక చకా వివరాలు వచ్చేసాయి!
'మహా మాయగాడు! టెన్త్ క్లాసులో స్లిప్పులు రాస్తూ దొరికిపోయి డిబార్ అయిపోయాడు. ఎమ్మే పరీక్షలు వీడి బదులు ఇంకొకరి చేత రాయించి, డిగ్రీ సంపాదించుకున్నాడు! రెండు లక్షలు ఇచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగం సంపాదించాడు. లంచగొండి! విలాస పురుషుడు! బ్యాంకు ఫైనాన్స్ మీద రెండేళ్ల క్రితం తీసుకున్న కారుకి ఇంతవరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు! ఈ నెలాఖరులో బ్యాంకు వాళ్లు వాడి కారు సీజ్ చేసి పట్టుకుపోతామని నోటీసు ఇచ్చారు!.....'అంటూ ఇంకా ఏదో రాసుకుపోతోంది.
"నీ మొహం తగలెయ్య!చాలు!! ఇహ ఆపేయ్!! బ్యాంకు వాళ్లు నా కారు పట్టుకుపోయి వేలం వేసేస్తారని నాకూ తెలుసు! అందుకే కదా... లిఫ్ట్ కోసం పూలింగ్ కార్ వివరాలు వెతుక్కోవడం!"అంటూ కంప్యూటర్ పీక నొక్కేసి, కుర్చీలోంచి లేచాను!
,*********
No comments:
Post a Comment