Saturday, April 12, 2025

 'ఓల్డేజ్ హోమ్'

*

"రాజేష్ మనల్ని ఓల్డేజ్ హోమ్ లో పడేస్తాట్ట" అన్న రుక్మిణిగారి మాటలకు కృష్ణమూర్తిగారు నవ్వి ఊరుకున్నారు.

"మీరెప్పుడూ ఆ నవ్వు మానరా? నేనోపక్క వాడు మనల్ని ఓల్డేజ్ హోమ్ లో పడేస్తాడంటుంటే మీకు కనీసం బాధగా కూడా లేదా?" అంటూ కోపంకాని కోపంతో రెట్టించి అడిగారావిడ.

కృష్ణమూర్తిగారు తన నవ్వును అదుపులో పెట్టుకుని "వాడు 'పడేస్తాను' అనలేదు. 'చేరుస్తాను' అన్నాడు. గమనించవా?" అని సమాధానం చెప్పారు.

"రెంటికీ తేడా ఏఁవిటో? ఐనా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను అలా ఓల్డేజ్ హోమ్ పడేయడానికి ... "అన్న భార్య మాటలకు అడ్డం పడుతూ "పడేస్తాను అనలేదు. 'చేరుస్తాను' అన్నాడు" అన్నారు కృష్ణమూర్తిగారు.

"ఏదో ఒకటి. ఏదైతేనేఁ? ఐనా ఆ పిల్లకు ఉండొద్దా? తనక్కూడా వయసైపోయిన తల్లిదండ్రులు ఉన్నారు కదా! వాళ్ళను వాళ్ళ కొడుకు అలాగే పడేస్తే?" అన్న మాటలకు కృష్ణమూర్తిగారు నవ్వి "వాళ్ళను కూడా వాళ్ళబ్బాయి ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తున్నాడట. అదే, నీ భాషలో 'పడేస్తున్నాడ'ట." అన్నారు.

"వీళ్ళకసలు బుధ్ధుందా? రేపు వీళ్ళు పెద్దవాళ్ళు అవ్వరా? వీళ్ళ పిల్లలు వీళ్ళను అలాగే చేస్తే?" రుక్మిణిగారి మాటలలో ఆక్రోశం ధ్వనించింది.

"అప్పటికి మనం ఉండంకదా!"

"ఈ మెట్ట వేదాంతమే వద్దనేది. ఆస్తి ముందుగా రాయొద్దంటే విన్నారు కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఇలోచించండి."

"ఆలోచించడానికేముందీ! వాళ్ళు చెప్పినట్లు ఓల్డేజ్ హోమ్ లో చేరిపోవడమే" కృష్ణమూర్తిగారి సమాధానంతో విసిగిపోయిన రుక్మిణిగారు "నేను మా అన్నయ్య దగ్గరకు వెళ్ళిపోతాను. మీరు ఎలాగైనా ఊరేగండి" అన్నారు.

"నీ మేనల్లుడు, మన అల్లుడు, కొడుకు ... అందరు కలిసే ఎవరి ముసలివాళ్ళను వాళ్ళే ఓల్డేజ్ హోమ్ చేర్చాలని నిర్ణయించుకున్నట్లు విన్నాను. ఎక్కడున్నా మన జరుగుబాటుకు ఇబ్బంది ఉండదులే రుక్కు. పెన్షను వస్తుంది. దాన్తో జరిగిపోతుందిలే."

"ఏంటండీ జరిగేది! అసలు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి" విసురుగా అన్నారు రుక్మిణిగారు,

"నేను మాట్లాడను. మనం ఇక్కడ ఎలా ఒంటరిగా ఉంటున్నామో అక్కడా అలాగే ఉంటాము. పైగా అక్కడ నలుగురూ పరిచయం అవుతారు ... " ఈయన వాగ్ధోరణికి చిరాకు పడ్డ రుక్మిణిగారు "ఇక్కడ లేవా పరిచయాలు? మనం వీధిలోకి వెళితే ఎంతమంది పలకరిస్తారో మీకు తెలియదా?" అంటూ ఎదురు ప్రశ్న వేసారావిడ.

"కేవలం పలకరిస్తారు. మొన్న నీకు జబ్బు చేసినప్పుడు వాళ్ళల్లో ఒక్కరైనా వచ్చి హాస్పిటల్లో ఉన్నారా, ఒక్క రోజైనా? అప్పుడు పిల్లల్ని వదిలేసి, శలవు పెట్టుకుని వచ్చి నీతో ఉన్నది నీ కోడలే. వీళ్ళెవరూ కాదు" అని సముదాయించే ప్రయత్నం చేసారు కృష్ణమూర్తిగారు.

"ఐతే ఆవిడగారి శలవులు అయిపోతాయనా మనల్ని ఓల్డేజ్ హోమ్ పడేస్తోంది?" ఆమె కంఠంలో కోడలి మీద అసంతృప్తి.

"నువ్వు అలా అర్థం చేసుకుంటే నేనేం చేసేది? వాళ్ళ ఇబ్బందులు కూడా చూడాలి కదా!"

"వాళ్ళ చిన్నతనంలోను, చదువుకునే రోజుల్లోను మనమే సర్దుకుపోయాం. ఇప్పుడు కూడా మన ఇష్టం వచ్చినట్లు ఉండటానికి లేదంటే నా మనసు అంగీకరించడం లేదు. మీరేమో శ్రీకృష్ణ పరమాత్మలాగా అన్నిటికీ తామరాకు మీద నీటి బొట్టు చందంగా ఉంటారు. అది నా వల్ల కాదు."

"పోనీ నువ్వు ఉండిపోతావా?" అన్న మాటలకు ఆవిడ చర్రున ఆయనవైపు చూసి 'నాతి చరామి' అంటే అర్థం అదేనా?" అని సూటిగా ప్రశ్నించారు.

కృష్ణమూర్తిగారు నవ్వి "సప్తపది హోమం చుట్టూ నువ్వు నాతో నడిచావా లేక నేను నీతో నడిచానా?" అని అనడంతో "ఏమన్నా అంటే లాజిక్కులు తీస్తారు" అంటూ మూతి బిగించారు రుక్మిణిగారు.

"సత్యభామ అలగడం విన్నాను కానీ రుక్మిణి అలగడం మొదటిసారి చూస్తున్నాను" అనడంతో ఆవిడ చివ్వున లేచి లోపలకు వెళ్ళిపోయారు.

****

నెల రోజులు గడిచాయి. ఇద్దరి మధ్యా మాటలు అంతంత మాత్రమే అన్నట్లు నడిచాయి.

ఆ రోజు రాజేష్, భార్యాసమేతంగా వచ్చాడు. వాళ్ళను చూడగానే రుక్మిణిగారు మొహం తిప్పుకున్నారు.

రాజేష్ తండ్రి పక్కన కూర్చున్నాడు.

కృష్ణమూర్తిగారు రాజేష్ చెయ్యి పట్టుకుని "ఏరా, ఈ ఇల్లు అమ్మేసావా?" అని అడిగారు.

"ఇంటి విషయం తరువాత తీరికగా మాట్లాడుదాం. మీ అభిప్రాయం కనుక్కుందామని వచ్చాను" అన్నాడు రాజేష్.

"అభిప్రాయం అంటూ ఏమీ లేదురా. నువ్వు చెప్పినట్లు బయల్దేరడమే" ఆయన స్వరంలో ఏదో తెలియని బాధ.

కొద్ది క్షణాల తరువాత కృష్ణమూర్తిగారే "ఎప్పుడు బయల్దేరాలి?" అని అడిగారు.

"మంచి రోజు చూసుకుని ... "

"మంచి రోజు! ఓల్డేజ్ హోమ్ లో చేరడానికి కూడా మంచి రోజు చూడాలా? ఇవాళే బయల్దేరుదాం. మీ అమ్మను బట్టలు సర్దమను."

"అమ్మ కోపంగా ఉంది."

"కోడల్ని మాట్లాడమను."

ఇంతలో రుక్మిణిగారు గదిలోనుండి బైటకు వస్తూనే "అంతా విన్నాను. మీరు, వాడు నిర్ణయాలు తీసేసుకున్నాక నన్ను అడగడం ఎందుకు? బయల్దేరండి" అంటూ ఉంటే రాజేష్ మౌనంగా ఉండిపోయాడు.

కృష్ణమూర్తిగారు చిఱునవ్వు నవ్వారు.

"ఆ నవ్వే వద్దనేది. పుండు మీద కారం అద్దినట్లు ఉంటుంది నాకు."

తల్లిది ఆక్రోశమో, కోపమో అర్థం కావడం లేదు రాజేష్ కు.

రెండు రోజుల్లోనే నలుగురూ బయల్దేరారు.

****

"ఓల్డేజ్ హోమ్ లో చేరడానికి కొత్త బట్టలు ఎందుకురా?" అనుమానంగా అడిగారు కృష్ణమూర్తిగారు.

"ఘనంగా ఉండాలని ... "

గంట ప్రయాణం తరువాత పెద్ద ప్రాంగణంలోకి ప్రవేశించింది కారు.

గేటు ముందు 'ఓల్డ్ ఏజ్ హోమ్' అన్న బోర్డు కనపడింది.

"ఇంత మోడరన్ గా ఉందేఁవిట్రా?" ఆశ్చర్యంగా అడిగారు కృష్ణమూర్తిగారు.

"ఔను నాన్నగారు. వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, టేబుల్ టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు" అన్న రాజేష్ వైపు చూసి, "నా పెన్షన్ సరిపోతుందా?" అని నవ్వుతూ అడిగాడాయన.

అలా మాట్లాడుకుంటూ ఉండగానే కూతురు, అల్లుడు, వియ్యంకుడు, వియ్యపురాలు వస్తూ కనిపించారు.

"వీళ్ళను కూడా ఇక్కడే చేర్చారా?" అని అడిగారు రుక్మిణిగారు.

"అందరం ఇక్కడే అత్తయ్యగారు" అన్న కోడలు మాటలకు దంపతులిద్దరూ కోడలివైపు చూసి "అందరమా? " అనగానే రాజేష్ కల్పించుకుని "ఔను నాన్నగారు. మీరు, అమ్మ ఆ ఊళ్ళో పడుతున్న ఇబ్బందులే మిగతా అందరి తల్లిదండ్రులు పడుతున్నారు. అందరం చిన్న పట్టణాలనుండీ, పల్లెలనుండి ఉద్యోగాలకోసం పట్నం వచ్చాం. మిమ్మల్ని మా దగ్గర పెట్టుకోవాలంటే ఆ ఎపార్టుమెంట్స్ లో మీరు ఇమడలేరు. అలాగని విల్లాలు తీసుకుందామంటే ఆర్థికంగా భారం అవుతుందని, ఊరికి దూరమైనా మేం అందరం కలసి ఈ స్థలం తీసుకున్నాం. ఎవరికి వాళ్ళం రెండస్థుల ఇళ్ళు కట్టించుకున్నాం. అందరం కలిసే ఉంటాం. కానీ మీకు కూడా ప్రైవసీ ఉండాలనే ఉద్దేశ్యంతో పై అంతస్థులో తల్లిదండ్రులు ఉండేలా, మొదటి అంతస్థులో మేం ఉండేలా ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టించుకున్నాం. గత రెండేళ్ళుగా నిర్మాణం జరుగుతూ ఉండటంతో అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేకపోయాను. అక్కడి డాక్టర్, స్కూల్లో నా క్లాస్మేట్ అవడంతో అతనితో మాట్లాడాను. ప్రమాదం లేదని తెలిసిన తరువాతే తనను పంపించి నేను ఉండిపోయాను" అన్న రాజేష్ మాటలకు రుక్మిణిగారు "మరి ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నావు?" అని అడిగారు.

"అమ్మా, ఓల్డేజ్ హోమ్ అంటే పెద్దల్ని వదిలేసి చేతులు దులుపుకోవడం కాదమ్మా. ఆ వయసులో ఉండవలసిన సౌకర్యం, ఆరోగ్యపరంగా వైద్య సదుపాయం అందుబాటులో ఉండటం, అన్నిటినీ మించి మా పిల్లలకు మీనుండి మంచి ప్రవర్తన, విద్యాబుధ్ధులు కావాలి. మీకు మనవళ్ళు, మనవరాళ్ళు కావాలి. వాళ్ళకు మీరు కావాలి. మాకు మీరు, వాళ్ళు కావాలి. అందుకే ఈ కాలనీకి 'ఓల్డేజ్ హోమ్' అన్న పేరు పెట్టుకున్నాం" అని ముగించాడు రాజేష్.

"మరి మన పాత ఇల్లు?" అనుమానంగా అడిగారు కృష్ణమూర్తిగారు.

"మీకు ఇష్టమైన వేద పాఠశాల నడపడానికి, తాతగారి జ్ఞాపకార్థం, ఆయన పేరు మీదే ఇచ్చాను" అన్న రాజేష్ మాటలకు కృష్ణమూర్తిగారు సంతోషంగా రాజేష్ చేతిని మృదువుగా తాకారు, "ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కాదురా రాజేష్. గోల్డ్ ఏజ్ హోమ్" అంటూ.

************************ (శుభం)

రచన : అధరాపురపు మురళీకృష్ణ,

No comments:

Post a Comment