Saturday, April 12, 2025

 ఇంటర్వ్యూ: 

కొత్త ఉద్యోగ ఇంటర్వ్యూ జరుగుతోంది. మార్కెటింగ్ శాఖలో మంచి జీతంతో అదనపు ఆదాయం వస్తుంది. నేను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో పోలిస్తే దాదాపుగా డెబ్బయి శాతం ఎక్కువ చేతికి వస్తుందంటే చాలా మంచి ఉద్యోగం కింద లెక్క. 

బాగా సన్నద్ధమై ఇంటర్వ్యూ కి వెళ్ళాను. అక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే నాకసలు అవకాశం ఉందా అనే సందేహం కలిగింది. అయినా శాయశక్తులా ప్రయత్నించకుండా నిరుత్సాహ పడడం ఏమిటని నన్ను నేనే ప్రోత్సాహించుకున్నాను. 

గంటకు ఇరవై మంది దాకా ఇంటర్వ్యూకి వెళ్లివస్తున్నారు. ఆ లెక్కన చూస్తే నా వంతు వచ్చేసరికి నాలుగున్నర ఐదు అవ్వచ్చు అనిపించింది. ఓపిగ్గా అందరినీ చూస్తూ కూర్చోవడం కష్టమే అయినా తప్పలేదు. భోజన విరామంలో వాళ్ళ కాంటీన్లో రుచికరమైన భోజనం చేసేసరికి నిద్రముంచుకు వస్తుంటే రెండుసార్లు చన్నీళ్ళతో మొహం కడుక్కుని కూర్చున్నాను. కునుకు తీసినా ఇంటర్వ్యూ చేసేవారికి తెలిసిపోతుంది. వాళ్ళు రుచిగా ఉండే భోజనం పెట్టేది మమ్మల్ని పరీక్షించటానికే. సీసీటీవీలు ఉన్నవి అందుకే.

మొత్తానికి నన్ను ఐదింటికి రమ్మన్నారు. లోపలికి వెళ్లి ఉన్న ముగ్గురికీ నమస్కారం చేసి నా గురించి చెప్పమంటే పరిచయం చేసుకున్నాను. 

ఇంటర్వ్యూ చేసే వ్యక్తి : ఇంతకుముందు చేసిన కంపెనీలో ఎన్నేళ్ల అనుభవం ఉంది మీకు. 

నేను : ముప్పై ఏళ్ళు.

ఇ చే వ్య : మీ వయసెంత అన్నాడు అనుమానంగా నా కాయితాలు చూస్తూ.

నేను : నలభై ఏళ్లు.

ఇ చే వ్య : మీ వయసు నలభై అంటున్నారు , ప్రస్తుతం చేస్తున్న కంపెనీలో ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను అంటారు , ఏమిటండి ఈ పొంతన లేని జవాబులు. 

నేను : లేదండి, సరిగ్గానే చెప్పాను , ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో చేరి ఇరవై ఏళ్ళు అయింది, పదేళ్లు ఓవర్ టైం చేసాను. 

ఇ చే వ్య: సరే మీరు వెళ్ళవచ్చు మీరు అబద్దాలు చెప్తున్నారు.

నేను : "మీ ప్రకటన ప్రకారం మీరు నాకిచ్చే ఉద్యోగంలో నేను చేయాల్సింది మీ ప్రొడక్ట్స్ మీకు అయినదానికన్నా ఐదురెట్లకు ఎక్కువకు అమ్మడం కదా. నేను నిజాలు చెప్పి అమ్మితే ఎవరు కొంటారు? నేను తడుముకోకుండా పదేళ్లు ఓవర్ టైం చేసాను అని మీతో అబద్ధమే చెప్పాను. మీ ఉద్యోగంలో ఎంత ఎక్కువగా అబద్దాలు చెప్పి నమ్మిస్తేనే కదా మీ వస్తువు అంత ఎక్కువగా అమ్మగలను, మీతో నిజాలు చెపితే నాకు ఉద్యోగ్యం ఇస్తే నేను మీరిచ్చే ఉద్యోగాన్ని సవ్యంగా ఎలా చేస్తాను ? " ఎదురు ప్రశ్నించాను. 

నాకేసి ఒక క్షణం చూసి " ఎప్పుడు చేరతారు " ఆడిగారాయన.

No comments:

Post a Comment