Sunday, July 19, 2026

 *సత్య దర్శనం*


*ఏదైనా బొమ్మ దీపాన్ని గోడకు తగిలించినంత మాత్రాన, అది అద్భుతమైన వెలుగునివ్వలేదు. అలాగే, ఇంటి గుమ్మానికి కట్టిన కృత్రిమమైన మామిడాకుల తోరణాలు అక్కడ సహజత్వాన్ని ఆవిష్కరించగలవా? లేదు. ఏనాడైనా కాగితం పూలు సువాసనల్ని వెదజల్లగలవా? అసాధ్యం. భోజనశాలలోని గోడలకు వేలాడదీసిన ఆహార పదార్థాల వర్ణచిత్రాలు అక్కడికి వెళ్లేవారి ఆకలి తీర్చలేవు. ఎందుకంటే, అక్కడ ఉండే అవేవీ వాస్తవమైనవి కావు. అవన్నీ కేవలం ప్రతిరూపాలు, పాక్షిక సత్యాలు. అయినా వాటి స్థానం వాటికి ఉంటుంది. ఇవ్వాల్సిన విలువను వాటికి తప్పకుండా ఇస్తారు. వాటి ప్రత్యేకత, మన్నన వాటికి కచ్చితంగా ఉన్నాయి, ఉంటాయి.*

ఒక వ్యక్తి మానస సరోవరం, కైలాస పర్వత ప్రాంతాల్ని చూసి తిరిగొచ్చాడు. తన చుట్టూ చేరినవారికి వాటి శోభను, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వర్ణించి మరీ చెబుతున్నాడు. అంతమాత్రానికే అతడి మాటలు వింటున్నవారంతా, ఆయా అద్భుత ప్రాంతాల అందాల్ని యథాతథంగా అనుభూతి చెందగలరా? లేదు. అందుకే ‘పర్వతానికి సంబంధించిన వర్ణన... వర్ణనే కానీ- పర్వతం కాదు, కాలేదు’ అని ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అనేవారు.

మానవుడు చేరాల్సిన గమ్యం గురించి అసలైన గురువులు ఎన్నడూ ముందుగానే చెప్పరు. లక్ష్యం చేరడానికి ఉపకరించే మార్గాన్ని మాత్రమే వారు సూచిస్తారు. ఎవరైనా రమణ మహర్షి వద్దకు వెళ్లి ‘దేవుడి గురించి తెలుసుకోవాలని ఉంది’ అని అడిగితే, ‘ముందు నిన్ను నువ్వు తెలుసుకో’ అని బదులిచ్చేవారు.

రాతలు, చిత్రాలు అనేవి- విలువైన సూచికలు. అవి కేవలం నిజాల్ని సూచించేవి. అంతే తప్ప, అవే నిజాలు కావు. ఒక కొత్త ప్రాంతానికి వెళ్లాలన్నా, అపరిచితుణ్ని కలవాలన్నా అవి ఎంతో ఉపయోగపడతాయి. అప్పటివరకు తెలియని నూతన ప్రదేశానికి ‘సమాచార పుస్తకం’ సహాయంతో ఎవరైనా చేరుకోవచ్చు. అసలే ఎరుగని ఒక నూతన వ్యక్తిని అతడి ఛాయాచిత్రం ఆధారంగా వెతికి పట్టుకోవచ్చు. విజ్ఞానశాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ఈ భూమిపై పుట్టిన మనిషి ఆ ఖగోళ రహస్యాల్ని ఎంతో కొంత తెలుసుకుంటున్నాడు. అక్కడికి ఏదో ఒకనాటికి తప్పకుండా చేరాలని ప్రయత్నిస్తున్నాడు. అదే మనిషి తన హృదయంలో గూడు కట్టుకొని ఉన్న దైవాన్ని గమనించలేకపోతున్నాడు. తన గుండెను నడిపిస్తున్న భగవంతుణ్ని ఓ సాధకుడిగా చేరలేకపోతున్నాడు.

మనిషి తన భౌతికమైన నేత్రాలకే పని చెబుతున్నాడు. అంతే కాని, అంతర్‌ నేత్రానికి సంబంధించిన ధ్యానం గురించి ఆలోచించడం లేదు. ఒకవేళ అంతరంగ ప్రపంచంలోకి అడుగుపెట్టాలన్నా, ఆ సాధకుడికి అప్పటికప్పుడు కలిగే సందేహాలు అనేకం!

‘దేవుడు ఒక్కడే అయితే- ఇన్ని ప్రాణుల్లో ఎలా ఉన్నాడు’ అని గురువును ఓ శిష్యుడు అడిగాడు. అప్పుడు ఆయన అనేక మట్టిపాత్రలు తెప్పించి, ఆరుబయట ఎండలో పెట్టించాడు. వాటి నిండా నీళ్లు పోయించాడు. ఆ తరవాత, పాత్రల్లోకి తొంగి చూడమని శిష్యుడికి చెప్పాడు. దాంతో అతడికి అన్నిచోట్లా ఏకకాలంలో సూర్య ప్రతిబింబాలు కనిపించాయి. ఆకాశంలో ఉన్నది ఒక్క సూర్యుడైనా, ప్రతి పాత్రలోనూ అదే ప్రతిరూపం గోచరించింది. ఆ విధంగానే జీవకోటి అంతటా సర్వేశ్వరుడు కొలువై ఉన్నాడని శిష్యుడు గ్రహించాడు.

పరంధాముణ్ని తెలుసుకోవాలన్న కోరిక మనిషికి కలగడం సహజమే. అందుకే అతడు సద్గ్రంథాలు బాగా చదవాలి. నిజమైన గురువుల బోధనల్ని శ్రద్ధగా వినాలి. తీర్థయాత్రలూ చేయాలి. అనంతరం, వాటి సారాంశాన్ని మాత్రమే మదిలో ఉంచుకోవాలి. అప్పటివరకు తాను చూసిన భౌతిక రూపాల్ని, విన్న శబ్దాల్ని మనసు నుంచి తొలగించాలి.

దేహంలోని అసలైన శక్తే మానవ జీవితానికి ఆధారమవుతుంది. అదే ఉపయోగపడుతుంది. ఆ శక్తి- ఆధ్యాత్మిక బోధనల సారం. జీవిత పరమార్థాన్ని తెలియజేసేది అదే!

ప్రత్యక్ష అనుభవమే మనిషిలోని అన్ని అనుమానాల్నీ దూరం చేస్తుంది. విశ్వానికి మూలమైనది, జగత్తును నడిపిస్తున్నది ఏమిటో తెలియాలంటే- అతడిలోని మూలాధార చక్రం జాగృతం కావాలి. అది ధ్యానంతో సాధ్యమే! ధ్యాన సాధనలో చివరి ఘట్టమే సత్యదర్శనం.

అలలతో కల్లోలమైనప్పుడు, కొలను అడుగుభాగం కనిపించదు. పలు చిత్త వృత్తులతో నిత్యం సంచలించే మనసూ అంతే! ఎప్పుడూ ఆలోచనలతో ఉండే అది, ఏదో ఒక దశలో విశ్రాంతి కోరుతుంది. అంతవరకు సాధకుడు ఓర్పుతో వేచి ఉండాలి. ఆ తరవాత, బ్రహ్మానందం అతడి సొంతమవుతుంది!      *ఆధ్యాత్మిక కుటుంబం*                        

No comments:

Post a Comment