*భస్మధారణ*
*భస్మధారణ కన్నా శివుని అనుగ్రహము పొందే ఉపాయము ఇంకోటి ఏదీలేదు.* *భస్మధారణ ధర్మార్థ కామమోక్ష ప్రదము.* *ఇది దేవతా ప్రీతికరము.* *శివునుకు అత్యంత*
*ప్రీతిదాయకము.*
గోమయంతో చేయబడిన భస్మము శ్రేష్ఠమైనది. భస్మాన్ని సేకరించేటప్పుడు 'సద్యోజాత' మంత్రాన్ని చెప్పాలి. తరువాత భస్మాన్ని 'అగ్నిరీత్యా' అనే మంత్రంతో అభిమంత్రించాలి. 'మానస్తోకే' అనే మంత్రంతో భస్మాన్ని నలిపి 'త్యంబకం' అనే మంత్రంతో భస్మాన్ని శిరసున ధరించాలి. 'మ్యాయుషం జమదగ్నే' అనే మంత్రంతో విభూదిని ముఖాన పెట్టుకోవాలి. విభూతి రేఖలు కనుబొమ్మలు చివరలు దాటరాదు. మధ్యమ అనామికలతో పై రేఖ, క్రింది రేఖ ధరించి, బ్రొటన వ్రేలితో కుడి నుంచి ఎడమకు మధ్య రేఖను గియ్యాలి.
విభూది రేఖలు మూడు ఓంకార రూపము. అవి అకార ఉకార మకారాలకు ప్రతీకలు. బుగ్వేదము, యజుర్వేదము, సామవేదములకు ప్రతీక. త్రిమూర్తులకు ప్రతీక. భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు. బ్రహ్మచారులు, గృహస్తులు, సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు. వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మధారణ చేయాలి.
భస్మధారణ వలన పాపాలు పోతాయి. స్త్రీహత్య, భ్రూణ హత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి. కానీ శివ దూషణ, శివుని ధనము అపహరణ వల్ల వచ్చే పాపము మాత్రము పోదు.
*విధి విధానము తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ, పాపములు, రోగాలు, పీడలు, బాధలు అన్నీ వదిలిపోతాయి. రుద్రాక్షమాల కంఠసీమను ధరించి, భస్మధారణ చేసినవాడు రుద్రుని వలె. పూజ్యుడగును. భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్ణములలోనూ స్నానం చేసిన ఫలితము వస్తుంది. ప్రతిదినము భస్మధారణ చేసినవాడు మరణానంతరము కైలాసము పొందుతాడు.*
*శివనామము*
*శివనామము అనే దావాగ్ని మహాపాతకములనే పర్వతములను బూడిద చేయును. ఇది సత్యము. వివిధ దుఃఖములకు పాపములే కారణము. అవి శివార్చన చేత మాత్రమే నశిస్తాయి. అవి నశించు మార్గము మరియొకటి లేనే లేదు.*
ఎవడైతే సర్వదా శరీరముతో, వాక్కుతో, మనస్సుతో శంకరుని శరణు వేడునో, వాడే వైదికుడు; వాడే పుణ్యాత్ముడు: వాడే ధన్యుడు: వాడే పండితుడు. శరీరముతో, మనస్సుతో, వాక్కుతో ఎవడు శంకరుని భజించునో, వాడే పండితుడని తెలియవలెను. అతడే జీవన్ముక్తుడనబడును.
త్రిపురములను నశింపజేసిన శివుని పూజ యందు శ్రద్ధ గలవారు ఆచరించే ధర్మష్మములు వెంట వెంటనే ఫలముల నిచ్చును. శివపూజచే ఎన్ని పాపములు నశించునో, అన్ని పాపములు భూలోకములో లేనే లేవు. బ్రహ్మ హత్యాది పాపముల అంతులేని రాశులైననూ శివస్మరణ చేత నశించును. శివనామము అనే నావను ఆశ్రయించిన వారి సంసారముల భూతములైన పాపము లన్నియూ నశించి, వారు సంసార సముద్రమును దాటుదురు. ఇది నిశ్చయము.
*సంసారమునకు మూలమైన పాపములు శివనామమనే గొడ్డలిచే నశించుట నిశ్చయము. పాపమనే దావాగ్నిచే పీడింపబడు మానవులు శివనామమనే అమృతమును పానము చేయవలెను. పాపమనే దావాగ్నిచే పీడింపబడు వారికి శివనామము లేకుండా శాంతి లేదు. శివానామమనే అమృత వర్షధారలతో తడిసిన మానవుడు సంసారమనే దావాగ్ని మధ్యలో నున్ననూ దుఃఖించడు. దీనిలో సందేహము లేదు. రాగ ద్వేషముల యందు సక్తమైన అంతఃకరణము గల వారికి శంకరుని యందు భక్తి కుదరదు. శంకరుని యందు భక్తి కుదిరిన మానవులకు శీఘ్రముగా మోక్షము లభించును. ❤️❤️❤️ *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment