*ఒక వ్యాపారాన్ని చేసేటప్పుడు ఏవిధంగానైతే సమీక్షలు చేస్తామో అలాగే, బంధాల విషయంలోనూ సమీక్ష తప్పనిసరి అని కథానాయకుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..*
*వివాహం పూలపాన్పు కాదన్నారు. ఇద్దరి మధ్య సరైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్నప్పుడే*
*బంధం నిలబడుతుందని, తనకూ చరణ్ కూ మధ్య అది చక్కగా పనిచేస్తున్నట్లు చెప్పారు.*
*బంధాన్ని మరింత ఉన్నతంగా మార్చుకోవడానికి ఉన్న చిట్కా ఏంటని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మసూమ్ మినావాలా అడగ్గా, "మేమిద్దరం సమస్థాయిల నుంచి వచ్చాం. మా పెళ్లి ముందే మాకు అవగాహన ఉంది. మనిషి విలువ, నమ్మకం, ఆరోగ్యకరమైన బంధాల కొనసాగించడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్థిరంగా ఎదుర్కొనగలిగే లక్షణం చరణ్ ఉంది. తండ్రి నుంచి అవి వచ్చాయి. అలాంటి వ్యక్తులు మహిళలు ఉన్నతస్థానానికి ఎదగడానికి ఎంతో సహకరిస్తారు. తను నాతో అలాగే ఉన్నాడు. ప్రతి దశలోనూ నాకు తోడుగా నిలిచాడు. అలాంటి వ్యక్తితో కలిసి ఉండటమే నా విజయ రహస్యం”*
*“మా కుటుంబం మొత్తం మా చుట్టూ ఉంటుంది. ఎప్పుడూ ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ఉంటాం. అది నా వైపు నుంచైనా, ఆయన వైపైనా. మాకెన్ని షెడ్యూల్స్ ఉన్నా, వాటిని సమన్వయం చేసుకుంటూ మాకంటూ ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుంటాం. వారంలో ఒకరోజైనా 'డేట్ నైట్' ఉండాలని మా అమ్మ చెబుతూ ఉంటారు. ఇది చాలా అవసరం. వీలైనన్నిసార్లు అది సాకారం అయ్యేలా ప్రయత్నిస్తాం. 'డేట్ నైట్'లో ఇంటి వద్దే ఉంటాం. ఫోన్లు, టీవీలు దూరం పెట్టేస్తాం. నేనూ, చరణ్ దీన్ని నెమ్మదిగా వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్నా”*
*“మా ఇద్దరికీ ఒకరితో ఒకరికి సమస్య ఉంటే, కచ్చితంగా కూర్చొని మాట్లాడుకుంటాం. అలా చేస్తే బంధం బలపడుతుంది. అది మరణించే వరకూ ఇది కొనసాగుతూనే ఉండాలి. వివాహ బంధంలో వీటిని ఆమోదించాల్సిందే. అంతేకాదు, రోజూ వాటిపై కసరత్తు చేయాలి. ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. అది శ్వాసలాంటిది. ప్రతి వివాహ బంధంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. మీ లక్ష్యాలు మీకు తెలిసినంత కాలం ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ విషయంలో మాకు మంచి మార్కులు పడతాయి. తరచూ వివాహబంధాన్ని సమీక్షించుకుంటూ ఉండాలి. బిజినెస్ లో ప్రతి లక్ష్యాన్ని సమీక్షించుకుంటాం. అది బంధాల విషయంలో ఎందుకు ఉండకూడదన్నది నా అభిప్రాయం. ప్రతి మూడు నెలలకొకసారి బోర్డు మీటింగ్ లు జరిగినట్లే మీతో మీరు మీటింగ్ పెట్టుకోవాలి. మీ లక్ష్యాలను సమీక్షించుకోవాలి. మీ కుటుంబ లక్ష్యాలను, వ్యాపార లక్ష్యాలను నిరంతరం సమీక్షించుకోవాలి” అని ఉపాసన అభిప్రాయపడ్డారు.*
No comments:
Post a Comment