*మమత*
కోనే నాగ వెంకట ఆంజనేయులు
విజయ ముఖంలో కళాకాంతులు లేవు. ఆ షాక్ నుండి యింకా తేరుకోలేదామె.
ఇదంతా నిజంగా జరిగిందా లేక తను కలగంటుందా?
కిటికీలోంచి నిశ్శబ్దంగా బయటికి చూస్తూ పరిపరి విధాల ఆలోచిస్తోందామె.
ఆమె చూపు ఎదురుగా ఉన్న గున్నమామిడిచెట్టు మీద వుంది గానీ ఆలోచనలు మాత్రం అక్కడ లేవు.
మనసుకి మబ్బు పట్టినట్లుగా ఉంది.
సీతాలు మాటలు యింకా ఆమె చెవిలో గింగుర మంటూనే ఉన్నాయి. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక పోతోందామె.
ఖనిజాన్నైనా జీర్ణించుకోవచ్చును గానీ కొన్ని నిజాల్ని జీర్ణించుకోలేము.
"..... ఆ రోజు మాయమ్మ సేసిన పనికి నానిప్పుడు బాధపడతన్నానమ్మా ! యికనైనా మీ కూతుర్ని మీరు తీసుకుని నా కూతుర్ని నాకిచ్చేతే మీకు దోహం సేశామన్న బాధ కొద్దిగైనా తగ్గుద్ది తల్లీ!"
జరిగింది విని తను నిశ్చేష్టురాలయింది. నోట మాట రాక అలా ఉండి పోయిందెంతో సేపు.
"నాను మల్లీ రేపొత్తానమ్మా" అని చెప్పి వెళ్ళి పోయింది సీతాలు.
ఎనిమిదేళ్ళుగా తనెంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కరుణ తన కన్న బిడ్డ కాదా? తన కడుపున పుట్టిన బిడ్డ సీతాలు దగ్గర పెరుగుతోందా?
తన కూతురు బిడ్డ సుఖంగా పెరగాలని పేదరాలైన సీతాలు తల్లి హాస్పిటల్లో పురిట్లోనే బిడ్డల్ని మార్చివేసిందన్న నిజం ఎంతో చేదుగా అనిపించింది విజయకు.
అలా ఎవరైనా చేస్తారా?
స్వార్థం ఎంత పనైనా చేయిస్తుందన్న నిజం ఆమె దృష్టికి రాలేదా సమయంలో.
ఎదురుగా ఉన్న చెట్టు మీద కాకి గూడు.
ఓ కాకి కావు కావున అరుస్తూ పిల్లల్ని బయటికి తరిమి వేస్తోంది. నిజానికవి కోయిల పిల్లలు.
కోయిల కాకి గూట్లో గుడ్లు పెడుతుంది. కాకి అవి తన గుడ్లే అనుకుని పొదుగుతుంది. ఆ పిల్లలు కొద్దిగా పెరిగేసరికి నిజం గ్రహించిన కాకి ఆ కోయిల పిల్లల్ని గూట్లోంచి తరిమి వేస్తుంది.
యిప్పుడు తనూ అదే చెయ్యాలా?
ఏం చెయ్యాలో పాలు పోవడం లేదామెకు.
భగవాన్ ఏమిటీ పరీక్ష! మనసంతా గందరగోళంగా ఉందామెకు.
"అమ్మా! ఆకలేస్తోందే తింటానికేమైనా పెట్టవా!" పరుగున వచ్చి తల్లి ఒడిలో దూరి మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అడిగింది కరుణ.
కరుణ ముఖంలోకి చూసింది విజయ. అమాయకంగా, పెద్ద పెద్ద కళ్ళతో ముద్దు లొలికి పోతున్న ఈ పాప తన కన్న బిడ్డ కాదా!
తన ప్రాణంలో ప్రాణంగా పెంచుకుంటున్న ఈ పాపను ఆమె తల్లికి అప్పగించి వేయాలా?
కరుణ లేకుండా తను బ్రతుక గలదా? రోజూ ఉదయాన్నే నవ్వు ముఖంతో తనను నిద్ర లేపే ఈ చిరు నవ్వుల చిన్నారి తన నుండి దూరమై పోతే తనెలా జీవించి ఉండగలదు?
సీతాలుతో వచ్చిన తన కూతురు లక్ష్మి రూపం విజయ మనసులో మెదిలింది.
అమాయకమైన ముఖంతో చిరుగులు పట్టిన బట్టలతో ఉన్న - తన పేగు తెంచుకుని పుట్టిన లక్ష్మిని చూస్తే తనలో ఏవిధమైన అపేక్షా కలగలేదు. ఏమిటీ చిత్రం!
ఒక వేళ యిదంతా సీతాలు ఆడుతున్న నాటకమేమో. యిప్పుడు తన కన్న బిడ్డను తమ దగ్గర సుఖంగా పెరిగేలా చేయడానికి వేసిన ఎత్తేమో నన్న అనుమానం కలిగినా - అది నిజం కాదని తేలిపోయింది.
తన కుడి తొడ మీద మోకాలికి దగ్గరలో నయా పైసంత తేనె రంగు పుట్టు మచ్చ ఉంది. సరిగ్గా లక్ష్మి కుడి తొడ మీద కూడా మోకాలికి దగ్గర్లో అలాంటి పుట్టు మచ్చ ఉంది తిరుగులేని సాక్ష్యంలా.
తన రక్త మాంసాలు పంచుకొని పుట్టిన బిడ్డ లక్ష్మి పట్ల తన కెందుకు ప్రేమ కలగడంలేదు? తన కన్నబిడ్డ కాదని తెలిసినా కరుణ మీద మమత ఎందుకు చచ్చిపోవడంలేదు? ఏమిటీ మాయ? ఏం చెయ్యాలిప్పుడు? పేగు తెంచుకుని పుట్టిన లక్ష్మిని తెచ్చుకోవాలా? ప్రాణంలా పెంచుకున్న కరుణను ఉంచుకోవాలో తేల్చుకోలేక పోతోందామె.
"నీకెలా యిష్టమో అలా చెయ్యి" అని భర్త కూడా నిర్ణయం తనకే వదిలేశాడు.
నిర్లిప్తంగా కిటికీలోంచి చూస్తూ ఆలోచిస్తోంది విజయ. పరిసరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ప్రక్క యింటి గుమ్మం ముందు ఓ పిల్లల కోడి గోల గోలగా అరుస్తోంది. ఆకాశంలో ఓ గద్ద పచార్లు చేస్తోంది - కోడి పిల్లల్ని ఎత్తుకు పోవడానికి.
రెక్కలు అడ్డుపెట్టి పిల్లల్ని రెక్కల్లో పొదువుకుంటోంది కోడి - పిల్లల్ని గద్దబారి నుండి
కాపాడుకోడానికి. నిజానికి అవి కోడి పిల్లలు కావు - బాతు పిల్లలు. పిల్లలన్నింటినీ రెక్కల క్రిందికి చేర్చుకుంది కోడి సురక్షితంగా. అయినా యింకా గోల గోలగా అరుస్తూనే ఉంది.
బాతు గుడ్లను కూడా తన గుడ్లే అనుకుని పొదుగుతుంది కోడి. గుడ్లలో నుండి వచ్చిన బాతు పిల్లల్ని - తన పిల్లలు కాదని గుర్తించి కూడా వాటిని తరిమి వేయకుండా తన పిల్లల్లాగే పెంచుతుంది.
ఆ దృశ్యం విజయకెంతో మనోహరంగా కనిపించింది.
అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేసిందామె.
ఆమె మనస్సుకి పట్టిన మబ్బు విడి పోయింది. ఆ రాత్రి ప్రశాంతంగా హాయిగా నిద్ర పోయిందామె.
"సీతాలూ! అయిందేదో అయిపోయింది. జరిగిందంతా మర్చిపో. లక్ష్మి నీ దగ్గరే ఉంటుంది. కరుణ ఎప్పటికీ నా కూతురే. నా దగ్గరే ఉంటుంది" ధృఢంగా చెప్పింది విజయ మరునాడు సీతాలుతో.
********
No comments:
Post a Comment