*ఆత్మ నివేదన*
ప్రపంచ కోలాహలంలో, కాలగతిలో... మనిషి తనను తాను వెతుక్కునే ప్రయాణమే ఆధ్యాత్మికం. ఇక్కడ భక్తి అంటే ఏదో ఒక రూపానికో, నామానికో పరిమితం కావడం కాదు. అది అనంతుడైన ఆ పరమాత్మలో తనను తాను లయం చేసుకునే అద్వితీయమైన అనుభూతి. చేసే పూజలు తాత్కాలికం కావచ్చు, కానీ అంతరాత్మలోని భక్తి శాశ్వతం కావాలి.
భక్తి అంటే బయట వెతికే ఆడంబరం కాదు. అంతరాలయంలో వెలిగే దీపం. గాలికి ఊగే దీపశిఖలా చంచలమైన మనసును, స్థిరమైన నిష్ఠతో పరమాత్మ పాదాలపై ఉంచడమే నిజమైన భక్తి. దానికి భాష లేదు. భావమే ప్రాణం. కన్నీటి బిందువులో భగవంతుణ్ని దర్శించడం, నిశ్శబ్ద ప్రార్థనలో ఆ పరాత్పరుడి శ్వాసను వినడం అలవాటు చేసుకోవాలి. ప్రేమ లేని భక్తి నీరు లేని నది వంటిదే. సృష్టిలోని ప్రతి అణువులోనూ, ప్రతి జీవిలోనూ ఆ విశ్వరూపాన్ని చూడగలిగినప్పుడే భక్తి పరిపూర్ణమవుతుంది.
కపటం లేని మనసు, గర్వం లేని మౌనం, అహం లేని అర్పణం.. ఇవే భక్తికి మూలస్తంభాలు. పనిని దైవకార్యంగా భావించినప్పుడు, బతుకు ఒక యజ్ఞమవుతుంది. మనలోని అహంకారం అనే హవిస్సును అందులో ఆహుతి చేయాలి. శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని ముచుకుందుడి వృత్తాంతం అహంకారాన్ని వీడి ఆత్మను పరమాత్మకు సమర్పించే పరమ పవిత్రమైన ఆత్మనివేదనకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఇక్ష్వాకు వంశ మహారాజు, పరాక్రమశాలి అయిన ఈ రాజర్షి దేవతల కోరికపై అసురులతో సుదీర్ఘకాలం పోరాడి అలసిపోతాడు.
తదనంతరం శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య లీలావిలాసంగా, గిరి గుహలో సుదీర్ఘనిద్ర నుంచి మేల్కొంటాడు. ఆ క్షణంలోనే శంఖ, చక్ర గదాధారియై కోటి సూర్యప్రభ సమానమై నిలిచిన ఆ నల్లనయ్య దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా వీక్షిస్తాడు ముచుకుందుడు. ఆ క్షణంలో అంతఃకరణ శుద్ధితో ఆ జగన్మోహనాకారుడి పాదపద్మాలను స్పృశించి ‘దేవా! నాడు కామ, క్రోధాది శత్రువులను గెలిచేందుకు పోరాడాను. కానీ నేడు నీ శరణాగతిలో నా సర్వస్వాన్ని విస్మరిస్తున్నాను. నా అహంకారాన్ని నీ పాదాలచెంత తృణీకరిస్తున్నాను. రాజ్యభోగాలు వద్దు. స్వర్గసుఖాలు వద్దు. నీ నామస్మరణే నా జీవన పరమార్థం’ అంటూ ప్రార్థిస్తాడు. పరంధాముడికి ఆత్మ నివేదన చేస్తాడు.
నిత్యం మారని ధ్యాస, అసత్యం చేరని మాట ఇవే భక్తికి పట్టుగొమ్మలు. వెలుపల నుంచి తెచ్చే వేయిరకాల పూల కన్నా, అంతరంగంలో పూసే భక్తి అనే ఒక పుష్పం ఆ దేవుడికెంతో నచ్చుతుంది. అలాంటి భక్తితో బతుకు పంటను పండించుకోవాలి. నిశ్చలమైన ఆత్మ నివేదనతో పరమాత్మ సాన్నిహిత్యాన్ని పొందాలి.
No comments:
Post a Comment