1970 ఒక ప్రేమకథ
మధువనీ లతాంత కాంతలార రారే ....మదభర యవ్వన మధునిధులారా రారే ...రారే
మధువనీ లతాంత కాంతలార రారే .....
వెచ్చని సాయంత్రం చల్లని రాత్రిగా మారుతున్న వేళ. శీతాకాలం కావటంతో చిరుచలి ముందుగానే ఇళ్ళలోకి దూరిపోయి వెచ్చదనం వెదుక్కుంటోంది. మెట్లమీద వాకిలికి చేరగిలబడి నెమ్మదిగా జాజులూ కనకాంబరాలూ కలిపి మాల కట్టుకుంటూ పాడుకుంటోంది లత.
ఈ పాటా, ఈ జాజులూ రాజాకు ఎంతిష్టమో ఎప్పుడూ తనచేత ఈ పాటే పాడించుకునేవాడు. "నీ గొంతెంత బాగుంటుందో తేనెలో ముంచితీసినట్లుగా" అనేవాడు తన బారెడు జడకి, ఆ జాజులూ కనకాంబరాలూ రత్న కిరీటంలా మెరిసిపోతాయని మెచ్చుకునేవాడు.
పనిమనిషి సాయంత్రం పందిరికి కాసిన ఈ జాజిపూలన్నీ కోసి అందులోకి మరువం, కనకాంబరాలూ కూడా కోసి ప్లేటులో పెట్టి దారపుండా అన్నీ సిద్ధం చేసి, "పూలు కట్టుకోండమ్మా" అని చెప్పి మరీ వెళుతుంది.
పనమ్మాయి సుజాతకు కూడా తెలుసు ఈ పూలు తనెంతగా ఇష్టపడేదీ. చీకటి పడుతోంది. దోమలకు వేళకూడా అయ్యింది" అనుకుంటూ త్వరగా మాల కట్టేసి కొప్పులో తురుముకుంటూ ఉంటే గేటు ఎవరో తీసిన చప్పుడైంది.
తల పైకెత్తి చూసిన ఆమెకు తెల్లని బట్టల్లో ఎవరో గేటు తీసుకుని రావటం కనిపించింది. ఎవరా?అని పరీక్షగా చూసింది కానీ, ఈమధ్య వయసు మీద పడటంవల్లో ఏమో దూరం చూపు ఆనటం లేదు. కళ్ళు చికిలించి చూస్తుంటే. ఆ ఆకారం నెమ్మదిగా దగ్గరికొచ్చింది. ఎక్కడో చూసినట్లుందే! ఎవరా ? అని ఆలోచిస్తుండగానే తెల్లని ప్యాంటూ షర్టూ, వేసుకుని తెల్లని ఉంగరాల జుట్టుతో ఉన్న అతను పలకరింపుగా నవ్వేడు. నవ్వగానే అతని పలువరుసలోని ఎడంవైపు పై పన్ను బంగారపుది కావటంతో తళుక్కున మెరిసింది.
ఒక్క నిముషం నిర్ఘాంత పోయినా వెంటనే తేరుకొని "రాజా" అన్నదావిడ నెమ్మదిగా అందామనుకున్నా ఆవిడ నోటినుండి సంభ్రమాశ్చర్యాలతో కూడి పెద్దగానే వినిపించిందామాట. "లతా ! గుర్తుపట్టావా నన్నూ! ఈపాటికి మర్చిపోయి ఉంటావనుకున్నా" అన్నాడతను. అతని గొంతుక కూడా అదొక రకమైన ఎగ్జైట్మెంట్ కి లోనయ్యి ఒణుకుతోంది.
ఆమె సంతోషాన్నంతా మొహంలోకి తెచ్చుకున్నట్లు ఒక్కసారిగా నవ్వింది. "ఇన్నాళ్ళకి … ఇన్నేళ్ళకి .. నేను… నేను గుర్తొచ్చానా. అసలు ఏమైపోయావు. ఎన్నాళ్ళ నిరీక్షణ ! ఇప్పటికి కరుణించావా ? అసలు నేను ఇందుకోసమే ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళూ బ్రతికున్నానా.” ఏదో ట్రాన్స్ లో ఉన్నదానిలా మాట్లాడుతూ. ఆనంద భాష్పాలు రాలుస్తోంది ఆవిడ.
చప్పున చెయ్యందుకున్నాడతను, "లతా" అంటూ. చల్లగా హిమశకలంలా ఉందాచెయ్యి. ఎంతసేపు పట్టుకుని దుఃఖించిందో తెలియదు. "లతా కాళ్ళు నెప్పులెట్టేస్తున్నాయి కూచోనా" అని అతడు అంటుంటే స్పృహలోకి వచ్చిన దానిలా చటుక్కున పక్కకు జరిగి కూచోమన్నట్లు సైగ చేసిందతనికి.
అప్పటికి వియోగ భారం తగ్గిందనుకుంటా ఇరువురూ ఒకరిమొఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. చూట్టూ ఏంజరుగుతోందో తెలియటంలేదు వారికి. చుట్టూ చీకటి ఆవరించేసింది. వీధిలైట్లు ఒక్కటొక్కటే వెలుగుతున్నాయి.
వయసు కనబడకుండా రంగువేసిన జుట్టూ, నుదుటున పెద్ద బొట్టూ, పెద్ద పెద్ద కళ్ళూ అరవైల్లో ఉన్నా వృద్ధాప్య ఛాయలేవీ కనపడటం లేదు ఆమెలో. పూర్ణ చంద్రుడిలా వయసు తెచ్చిన హుందాతనంతో వెలిగిపోతోంది ఆవిడ.
అతనూ తెల్లని వస్త్రాల్లో తెల్లని ఉంగరాల జుట్టుతో ధృఢత్వం ఇంకా తగ్గక సహజమైన రాచఠీవితో మెరిసిపోతున్నాడు. "నేను.. నేను ఇక్కడున్నానని నీ కెలా తెలుసు ? అసలు సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చావు ? నీ భార్యా పిల్లలూ ఎలా ఉన్నారు ? " ప్రశ్నమీద ప్రశ్నలు సంధిస్తుంటే అతను నవ్వుతూ, "దోమలు కుట్టేస్తున్నాయి లతా. నన్నిక్కడే కూర్చోబెట్టి మాట్లాడతావా ? లోపలకు రానియ్యవూ, అన్నాడు.
ఆవిడ "అయ్యో" అని నాలుక కరుచుకుని మెట్లమీద నుంచి లేచి, ఇంట్లోకి దారి చూపిస్తూ ఆహ్వానించింది. అతను లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఆవిడ లోపలినించి మంచినీళ్ళు పట్టుకొచ్చింది. గబగబా తాగేసి "ఇంకొంచెం" అన్నాడతను. ఆశ్చర్యంగా చూస్తూ ఫ్రిజ్ లోని మంచినీళ్ళ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టింది.
గటగటా అతను తాగే తీరు చూసి నవ్వుతూ, "సింగపూర్ నించి నడిచొచ్చావా ఏంటీ ? అంత దాహంగా ఉంది నీకు" అంది. అతనూ నవ్వేస్తూ "మరి అంత తేలిగ్గా దొరికిందా నీ అడ్రస్ నాలుగు వీధులు తిరగాల్సి వచ్చింది" అన్నాడు.
అతన్ని చూస్తూ "ఇప్పుడు చెప్పూ ఇక్కడ ఇప్పుడు ఇలా ఏమిటీ ?" అంది. "అదో పెద్ద కథ లతా. ఇంతకీ నీ సంగతి చెప్పూ పిల్లలు ఎక్కడా ? ఇంట్లో ఇంకెవరూ లేరా నువ్వొక్కదానివేనా? మీ వారూ” అడగలేక అడుగుతున్నాడతను. "నేను నీ అంత విశాల హృదయమున్న దాన్ని కాదులే, మనసొక చోట ఇచ్చి మనువొకచోట చేసుకోటానికి. నీ సంగతి అడిగితే నా సంగతులు చెప్పమంటావేం” గద్దించింది ఆమె.
"అంటే ..అంటే.. నువ్వు పెళ్ళి చేసుకోలేదా! ఆరోజు ...ఆరోజు ఎయిర్ పోర్ట్ లో నిన్ను కావలించుకొని ఏడుస్తున్న కుర్రాడు” అతను కాస్త హతాశుడైనట్లుగా తల వంచుకుని ఆలోచిస్తున్నాడు. ఆమె కూడా మాట్లాడకుండా వంటింట్లోకి నడిచి కాఫీ పెడుతూ, విజయనగరంలో తన బాల్యపు రోజులను గుర్తుచేసుకుంది.
తనూ రాజా పక్కపక్క ఇళ్ళలోనే ఉండేవారు. బాల్యం నించీ అరమరికలు లేకుండా ఆటాపాటలతో కలిసిపెరిగిన స్నేహం. చదువుల్లోనూ ఆటల్లోనూ ఒకరికొకరు పోటీగా పెరిగారు. పెద్దయ్యి కాలేజీకి వచ్చాక తమ స్నేహానికి సహజంగానే ఏర్పడే ఎన్నో అవాంతరాలూ అడ్డంకులూ వచ్చాయి. వ్యాపారస్తుడైన రాజాతండ్రికి, చిన్నపాటి రైతుకుటుబంలోంచి వచ్చిన తనమీదా, తన స్నేహం మీదా ఎన్నో అనుమానాలు. రాజాకీ, తనకీ ఒకరినొకరు పలకరించుకోరాదని ఆంక్షలు. పర్యవసానంగా తమ ఇద్దరి స్నేహం మరింత బలపడి, ప్రేమగా మారింది.
వ్యాపారం విస్తరించే ఉద్దేశ్యంతో వాళ్ళ నాన్న విదేశీ వ్యాపారానికి మొగ్గుచూపటంతో అతని కుటుంబం సింగపూర్ చేరింది. తరువాత తమిద్దరిమధ్యా ఎన్నో ఉత్తరాలు నడిచాయి. ఒకరకంగా చెప్పాలంటే, దూరంగా ఉన్నందువల్ల ప్రేమ మరింత పెరిగింది.
రాజా తన ప్రేమనంతా సిరాలో ఒలకబోసి ఎన్నో ప్రేమలేఖలు రాసేవాడు. త్వరలో భారత్ కు వస్తానని తనను పెళ్ళి చేసుకుంటాననీ నమ్మకంగా వ్రాసేవాడు. రాబోయే రోజుల్లో తమ వైవాహిక జీవితం ఎలా ఉండబోతోందో ఆ ఉత్తరాల్లో నింపేసేవాడు. అవి చదువుకుని తనెంతో మురిసిపోయేది. అలాగే రెండేళ్ళు గడిచాయి. తన డిగ్రీ పూర్తయింది
ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తను ఎన్ని సంబంధాలో తిప్పికొట్టింది. ఇంట్లో బైటపడ్డ ప్రేమలేఖలు చూసి తండ్రి ఆశ్చర్యపోయాడు. చాలా బాధపడ్డాడు. తన సంగతి ఎలాగూ బైటపడింది గనుక, అతనికోసం ఎన్నాళ్ళైనా ఎదురుచూస్తాననీ, తను రాజాను తప్ప వేరే వ్యక్తిని పెళ్ళాడనని తెగేసి చెప్పింది. చెళ్ళెళ్ళు ఇద్దరికీ పెళ్ళిచేసెయ్యమని తండ్రిని కోరింది. అయినా ఒక ఆరునెలలు తండ్రి ఆమెను మార్చాలని ఎన్నోవిధాల ప్రయత్నించాడు. ఆమెమారలేదు.
విసుగెత్తిపోయి, సంవత్సరం లోపే తమకు తగిన సంబంధాలు చూసి చెల్లెళ్ళకు పెళ్ళిచేసాడు తండ్రి. తనూ తన చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కుంది. ఆ తరువాత ఒక రెండు నెలలు రాజానుండి ఉత్తరాలు లేవు. తను పదేపదే జాబులు రాయగా రాయగా కొన్నాళ్ళకు రాజా పెళ్ళి శుభలేఖ పోస్ట్ లో వచ్చింది.
ఒక్కసారిగా దాన్ని చూసి తట్టుకోలేకపోయింది. కొన్నాళు విపరీతంగా ఏడ్చింది. ఆత్మహత్య కూడా చేసుకుందామనుకుంది. బద్దలైన హృదయాన్ని కూడదీసుకుంటూ చెల్లెలు కొడుకైన పసివాణ్ణి పెంచుతూ మనుషుల్లో పడింది.
ఇన్నాళ్ళుగా చెల్లెళ్ళ పిల్లల్ని పెంచుతూ వాళ్ళే లోకంగా బ్రతికింది. పిల్లలకూ పెద్దమ్మంటే అమితమైన ప్రేమ! అందరూ పెద్దవాళ్ళై ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. చిన్నవాడు రెండేళ్ళనాడు అమెరికా వెళ్ళాడు. ఇంకా వాడికి పెళ్ళిచేయాలి. వాడికి తనంటే ఎంతో ఇష్టం వదిలి వెళ్ళాలంటే చిన్న పిల్లాడిలా ఏడ్చాడు ఏయిర్ పోర్ట్ లో.
అది రాజా ఎప్పుడు చూసాడో. అంటే రెండేళ్ళనుంచీ ఇక్కడే ఉంటున్నాడా ? ఉంటే ఎయిర్ పోర్ట్ లో నన్నెందుకు పలకరించలేదూ? ఎన్నో సందేహాలు ఆమెలో. “ఏయిర్ పోర్టులో నన్ను చూసావా మరి పలకరించలేదేం" కాఫీ కప్పు చేతికిస్తూ కొంచెం గద్దిస్తున్నట్లుగా అడిగింది.
"నీ చుట్టూ చాలామంది. నిన్ను వదలలేక ఏడుస్తున్న నీ కొడుకు. పైగా చాలా రోజులైంది కదా! ఈ ముసలివాణ్ణి గుర్తుపడతావో లేదోననీ” సందేహంగా ఆగిపోయాడతను. మనసులో చెలరేగే ఉప్పెనలేవో దాచుకుంటున్నట్లు అతని కళ్ళు ఎర్రగా ...
ఆమె కళ్ళు కన్నీటి చెలమలయ్యాయి. "నిన్ను నిన్ను ఏలా మర్చిపోతాను రాజా. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణం నానించి విడిపోయినప్పుడే” ఆమెకు దుఃఖం ఆగటం లేదు. అతని రెండుచెతులూ పట్టుకుని వెక్కిళ్ళతో ఏడవసాగింది. అతను ఆమె వీపు నిమురుతూ ఉండిపోయాడు. అతని చల్లని చేతివేళ్ళ స్పర్శ ఆమెలోని బడబాగ్నిని కొంత చల్లబరచింది.
కాసేపటికి తేరుకుని, చెంగుతో కళ్ళు, ముఖం తుడుచుకుంది లత. "అయ్యో ! తినడానికి ఏమీ పెట్టలేదు ఉండు” అని వంటగదిలోకి వెళ్ళింది. "చాలా ఆకలిగా ఉంది లతా, వంట చేసెయ్యి భోంచేద్దాం ఇద్దరం " అన్నాడతను. కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ "అలాగే" అని హడావుడిగా వంటకు ఉపక్రమించింది లత.
టేబుల్ సిద్ధం చేసి భోజనానికి పిలిచింది. ఈలోగా స్నానం చేసి మళ్ళీ అవే బట్టలు కట్టుకుని వచ్చాడతను. "మావారి బట్టలు ఉన్నాయి ఇవ్వనా ? " అడిగింది లత తమాషాగా అతన్ని ఆటపట్టిస్తూ. "నీవు పెళ్ళి చేసుకోలేదు లతా, ఆ సంగతి నాకు ఈరోజుకు తెలిసింది. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ముందు తెలుసుకోలేకపోయాను. అంతా అయిపోయాక ఇప్పుడు తెలుసుకుని ఏమి లాభం” అన్నాడతను భారంగా నిట్టూరుస్తూ ...
"సరే..సరే ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏముంది ? వడ్డించాను భోంచెయ్యి" అంది ఆవిడ. అన్నం తిని వారం రోజులు అయినట్లుగా ఆత్రంగా తింటున్న అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ తనకోసం వండింది కూడా అతనికే వడ్డించిందామె. తను దోసెవేసుకుని తిని హాల్లోకి వచ్చేసరికి. ఎర్రని గాజు గోళాల్లాంటి కళ్ళతో శూన్యంలోకి చూస్తున్నాడతను.
"ఇల్లెక్కడా మీదీ కారేమైనా ఉందా వీధిలో ? ఒక్కడివే వచ్చావా. మీ పిల్లలకు ఫోన్ చెయ్యనా ?" ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్న లతని వారిస్తూ రెండు చేతులూ పట్టుకుని, "ఈ లోకంలో నాకు తోడెవ్వరూ రాలేదు లతా నేనొక్కడినే. ఈ రాత్రికి ఇక్కడే ఉండనా ? నీకు అభ్యంతరం లేకపోతేనే" చల్లని చేతులు వణుకుతుండగా అభ్యర్ధించాడు అతను. చటుక్కున చేతులు వెనక్కి లాక్కుని "అలాగే రాజా అందులో అభ్యంతరమేమున్నది" అంటూ పడకగది చూపించింది లత.
"గుడ్ నైట్" అని చెప్పి వెనుదిరుగుతున్న ఆమె చేతిని పట్టుకుని గాజుగోళాల్లాంటి కళ్ళతో ఆమెను దీనంగా చూస్తూ, "కాసేపుండవా .ప్లీజ్" అన్నాడు. అతని ప్రవర్తనకు మనసులో ఆశ్చర్యపోతూ, మనసు కల్లోల సముద్రం కాగా అదుపు చేసుకోవడం కష్టమై, నిస్సత్తువగా బెడ్ మీద కూలబడి "ఇప్పుడు చెప్పు, ఘనత వహించిన రాజావారు, భార్యామణిని కోట్లాది రూపాయల సింగపూరు వ్యాపారాన్నీ ఒదిలేసి, ఈ పేద చరణ దాసి దగ్గరకు ఎందుకొచ్చినట్లు ? అభ్యంతరం లేకపోతే చెప్పొచ్చు" అన్నది వ్యంగ్యంగా.
అతను తలవంచి గొణుగుతున్నట్లుగా "పొరపడ్డాను లతా పొరపడ్డాను. నీ పెళ్ళి శుభలేఖ చూసి పొరపడ్డాను. నువ్వు పెళ్ళి చేసుకున్నావన్న కసితో నేనూ పెళ్ళి చేసుకున్నానని నీకు శుభలేఖ పంపాను. కానీ కానీ ఆ పని చెయ్యలేక పోయాను. నీ ప్రేమనీ, మోసాన్నీ తలుచుకుంటూ ఇలా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయాను" అన్నాడతను.
నేను పెళ్ళి చేసుకున్నానా! అసలు నాకు పెళ్ళేమిటీ ? పైగా నీకు నేను పెళ్ళికి రమ్మని శుభలేఖ పంపటం ఏమిటీ ? ఆశ్చర్య పోయింది లత. "అవును లతా! మీ నాన్నగారే ఆ శుభలేఖ పంపించారు. పెళ్ళైన ఆడపిల్లని ఇకపై ఉత్తరాలతో విసిగించవద్దన్నారు. అందుకే బదులుగా నా పెళ్ళి శుభలేఖ సృష్టించి పంపించాను నీకు." తప్పుచేసిన వాడిలా తలవంచుకున్నాడతను.
ఒక్కసారిగా దుఃఖం తన్నుకొచ్చింది ఆవిడకు. అతన్ని కావులించుకుని, "రాజా! ఎంత తప్పుజరిగింది. ఇద్దరం ఒకరికోసం ఒకరం ఇలా మిగిలిపోయామా ? అయ్యో" అని చాలా బాధపడింది. అతని మంచుగడ్డ లాంటి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని, నిప్పుల్లా ఎర్రగా ఉన్న కళ్ళలోకి చూస్తూ, మరి ఇప్పుడేం చేస్తున్నావ్. నీ వ్యాపారానికి నీకు వారసులూ ?" అడిగింది ఆవిడ.
"ఇద్దరు మగపిల్లలను అనాధాశ్రమం నుంచి తెచ్చి పెంచుకున్నాను. అమ్మా నాన్నా కాలం చేసాక, పిల్లలతో భారత్ కు వచ్చేసాను. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి వ్యాపారం అప్పగించాను. ఎయిర్ పోర్టులో నిన్ను చూసి అతడు నీ పిల్లవాడే అనుకున్నాను" తప్పుచేసిన వాడిలా తలవంచుకుని చెప్పాడతను.
ఇద్దరూ ఒకరినొకరు కావలించుకుని ఎంతసేపు ఏడ్చారో .. ఇన్నాళ్ళు మనసుల్లో గూడుకట్టుకున్న బాధ అంతా కన్నీటి వరదకు కరిగి బైటకు వెళ్ళిపోయింది. మనసులు తేలికపడ్డాయి. అలాగే నిద్రాదేవి నెమ్మదిగా ఇద్దరినీ ఆవహించింది. ఇద్దరూ ఎంతసేపు నిద్రపోయారో తెలియదు. బారెడు పొద్దెక్కాక మెలకువ వచ్చింది లతకు. పక్కన మంచమ్మీద చూసింది అతను లేడు.
బహుశా బాత్రుంలో ఉన్నాడేమో అనుకుంటూ వంటింట్లోకి నడిచింది. రాత్రి తనుచేసిన వంటంతా కంచం నిండా వడ్డించబడి అలాగే ఉంది! హాల్లో కాఫీ కప్పులూ, మంచినీళ్ళ బాటిల్సూ ఎవరూ తాగకుండా అలానే ఉన్నాయ్!
"రాజా రాజా " అని కేకేస్తూ బాత్రూం వెదికింది ఎవ్వరూ లేరు. ఆమెకు ఏమీ అర్ధం కాలేదు తను తనేమైనా కలగన్నదా ? వంటింట్లోని కంచంలో వడ్డించిన పదార్ధాలు కాదని చెబుతున్నాయి! వాకిట్లోకి వచ్చి మెట్లమీద కూర్చుంది. రాజాను తల్చుకుని కన్నీళ్ళు కార్చింది. రాత్రి తామిద్దరూ మాట్లాడుకున్నదంతా గుర్తు రాసాగింది.
రాత్రి జరిగింది కలో నిజమో తెలియని అయోమయం. రాజా నిజంగా పెళ్ళి చేసుకోలేదా ? ఇప్పుడెక్కడ ఉన్నాడో. ఇరవై ఏళ్ళ వయసులో తననుంచి దూరంగా వెళ్ళిన వాడు! ఇప్పుడు రాత్రి తను చూసినట్లే ఉండి ఉంటాడా?
అసలు ఈ జన్మలో మళ్ళీ తను రాజాని చూడగలదా ? చుట్టుకుంటున్న ఆలోచనలతో కందిరీగల తుట్టెలా ఉందిమనసు. ఆలోచిస్తూ మెట్లమీద పేపర్ బాయ్ విసిరేసిన ఆరోజు పేపర్ చేతిలోకి తీసుకుంది.
మొదటి పేజీలో నిన్న తను చూసిన రాజా ఫోటో! పెద్ద అక్షరాలతో! నిన్న ఉదయం ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాధ రాజా మరణం. రేపు పంజాగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు అని! ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవై పేపర్ వైపే చూస్తున్నాయి. కళ్ళు మూతపడలేదు ఇంక.
కాసేపటికి చేతిలో పేపర్ గాలికి ఎగిరిపోయింది. ఇంకొద్దిసేపటికి పనిమనిషి వచ్చి,"ఎండలో కూర్చున్నారేంటమ్మా" అని పలకరిస్తే పలకలేదు. తేడాగా కనబటటంతో మనిషిని తడుతూ "అమ్మా ! అమ్మా!" అనిపిలిచింది. ఆమె పిలుపుకు స్పందించే స్థితిలో లతమ్మ లేదు. శరీరంలో నుంచి హంస ఎప్పుడో ఎగిరిపోయింది. బంధువర్గం అందరూ వచ్చి చూసి ఘొల్లుమన్నారు.
మర్నాడు ఆమెకు కూడా అంత్యక్రియలు జరిగాయి ...పంజగుట్ట స్మశానవాటికలో ....
పద్మజ కుందుర్తి.
No comments:
Post a Comment