Saturday, April 12, 2025

 రాణి గారి వజ్రాల హారం (కథ)  – నారంశెట్టి ఉమామహేశ్వరరావు 

రత్నగిరి మహారాజు రాజసింహుడు  సౌందర్య ప్రేమికుడు. ఆయన అభిరుచికి తగ్గట్టు  సౌందర్యవతి అయిన మయూఖా దేవిని  వివాహం చేసుకున్నాడు. ఆమెను ఎక్కువగా ప్రేమిస్తాడు. శత్రువుల పాలిట సింహస్వప్నం లాంటి మహారాజు  కోటలో మాత్రం భార్య మాట జవదాటడు.  

ఒక సంవత్సరం  మయూఖాదేవి  పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు   గొప్ప కానుక ఇవ్వాలనుకున్నాడు  మహారాజు.  నగరంలోని వజ్రాల వర్తకులను పిలిపించి, మహారాణికి   సరిపోయే  వజ్రాల ఆభరణాలను చూపించమన్నాడు. 

వర్తకులంతా తమ దుకాణాల నుండి గొప్ప విలువైన నగలను, వజ్రపు ఆభరణాలను తెచ్చి చూపించారు.  వాటిలో ఒక  వజ్రాల హారం తనకి నచ్చినట్టు చెప్పింది మహారాణి. అయితే ఆ హారం ధర తనకి సంతృప్తినిస్తేనే కొనుగోలు చేయమని చెప్పింది మహారాణి.   
ఆ హారం విలువ  లక్ష వరహాలని చెప్పాడు  వ్యాపారి.  తొంభై వేల వరహాలకు ఇస్తేనే తీసుకొమ్మని, లేదంటే పంపేయమని చెప్పింది మహారాణి.    

ఆ వ్యాపారి  “మా దుకాణంలో తయారైన హారాన్ని  మహారాణి ధరించారని గొప్పగా చెప్పుకోవాలని , అలా అయితే మాకు సంపన్నుల నుండి మరిన్ని  బేరాలు వస్తాయని అసలు  ధర  చెప్పాను మహారాజా. అందులో నాకేమీ లాభం ఉండదు” అని వినయంగా చెప్పాడు. 

మహారాజు ఆలోచనలో పడ్డాడు.  

ప్రక్కనే ఉన్న మంత్రి వైపు చూసాడు . మంత్రి వచ్చి రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు. రాజు ముఖంలోకి చిరునవ్వు వచ్చింది.  

 హారాన్ని కోటలో  ఉంచేసి వ్యాపారిని వెళ్లిపొమ్మన్నాడు మహారాజు.  రాణి గారితో చర్చించి తరువాతి రోజుకి  నిర్ణయం చెబుతానని వ్యాపారికి మాట ఇచ్చాడు.  

ఆ రాత్రి  హారం విషయం రాణిగారితో మాట్లాడినప్పుడు  “హారం తనకి ఎంతగానో నచ్చిందని , తన సొగసులకు  కొత్త  అందం తెచ్చిందని” సంతోషంగా చెప్పింది మయూఖాదేవి.  లక్ష వరహాలకు కొనడం మాత్రం  ఇష్టం లేదని నిర్మొహమాటంగా   చెప్పిందామె. 

హారం నచ్చిందని చెప్పినప్పుడు ఆమె కళ్ళలో కనబడిన కాంతిని గమనించాడు రాజసింహుడు. ఆమెకి నచ్చిన హారాన్ని ఆమె కోరిన విలువకు కొనడమెలాగని ఆలోచించాడు.  

 మరునాటి  ఉదయం కోశాధికారిని పిలిపించి తన ఆలోచన  చెప్పి , వ్యాపారి ఇంటికి భటులను పంపమన్నాడు.  

ఒక భటుడి ద్వారా వ్యాపారికి ఒక లేఖ, రెండు దంతపు పెట్టెలను  పంపాడు కోశాధికారి. ఆ పెట్టెల్లో ఒకదాని మీద తొంభై వేల వరహాలు, మరోదాన్ని మీద వజ్రాల హారం అని రాసి ఉంది.
 భటుడిచ్చిన ఉత్తరం అందుకుని చదివాడు  వ్యాపారి. అందులో ‘మీ వజ్రాల హారాన్ని తొంభై వేల వరహాలు విలువ నిర్ణయించింది మహారాణి. మీకు పంపిన  పెట్టెల్లో ఒక దాంట్లో  తొంభైవేల వరహాలు, మరో పెట్టెలో వజ్రాల హారం ఉన్నాయి. మీరు ఒకదానిని ఎంచుకోవచ్చు.  నిర్భయంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని రాసి ఉంది. 

సరిగ్గా అప్పుడే దుకాణానికి వచ్చింది  వ్యాపారి భార్య.  

జరిగినదంతా భర్త ద్వారా తెలుసుకుంది.  “రాజుగారితో విరోధం మంచిది కాదు. ఇంకోచోట  లాభం పొందవచ్చు. రాజుగారు పంపిన వరహాల పెట్టె  తీసుకోండి” అని సలహా ఇచ్చింది . 

అప్పుడు వ్యాపారి  “ధర తగ్గించి అమ్మే ఆభరణం కాదు అది.  లాభమేమీ  వేసుకోకుండా దాని అసలు ధర  లక్ష వరహాలు. అందువల్ల  హారం ఉన్న పెట్టెను తీసుకుంటాను” అని చెప్పి , వజ్రాల హారం ఉన్న పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. దాంతో   
వరహాలు అని రాసి ఉన్న పెట్టెను తీసుకుని భటుడు వెళ్ళిపోయాడు. 

 పెట్టెలోని హారాన్ని తీసి దుకాణంలో పెట్టాలని తెరిచిన వ్యాపారికి అందులో వజ్రాల హారం కనబడలేదు. ఆ స్థానంలో ఒక ఉత్తరం ఉంది.  అందులో ” మీరు నిర్ణయించిన  వజ్రాల హారం విలువ లక్ష వరహాలు మా కోశాగారం  నుండి పొందవచ్చు “ అని ఉంది.    

ఆ విషయం బయటకే చదివాడు వ్యాపారి . అది విన్న అతడి భార్య ఆశ్చర్యంగా  భర్త వైపు చూసింది.  “మరెందుకలా రెండు పెట్టెలు పంపడం? నేరుగా  మీరడిగిన విలువ  చెల్లించవచ్చు కదా. ఏది కావాలో నిర్ణయించుకోమని అడగడం  దేనికి? “ అంది.  


 వ్యాపారి “మనకు గిట్టుబాటయితే తొంభై వేల వరహాలకి ఇస్తామని , కుదరని పక్షంలో మాత్రమే వజ్రాల హారం తీసుకుంటామని భావించి అలా చేసి ఉంటారు. మహారాజు గారికే   ధర తగ్గించడం  లేదంటే గిట్టుబాటు ధర కాదేమోనని మనమడిగిన విలువ చెల్లించడం కోసం ఉత్తరం పెట్టారు“ అన్నాడు . 

“నేను చెప్పినట్టు చేసి ఉంటే మనకు పదివేల వరహాలు నష్టం వచ్చేది” అంది వ్యాపారి భార్య విచారంగా. 

“అలా ఎందుకనుకోవాలి? మహారాణి చెప్పినట్టే చేసి ఉంటే పదివేల వరహాలు రాజుగారికి మిగిలేదని అనుకోవచ్చు కదా. రాణి గారి  మీదున్న ప్రేమతోనే మనమడిగిన విలువ  చెల్లించారు “ అన్నాడు వ్యాపారి. 

వ్యాపారి భార్య మౌనం వహించింది.  


మహారాణి గారి ప్రధాన చెలికత్తె రత్నాంగి ఉన్న ఇల్లు వ్యాపారి ఉన్న వీధిలోనే  ఉంది. 

తరువాత రోజు ఆ దారిలో వెళుతున్న రత్నాంగితో వ్యాపారి భార్య మాట్లాడుతూ , రాణి గారు కొన్న వజ్రాల హారం విషయం చెప్పింది. “మహారాణి గారికి ఆభరణాల ఎంపిక  తెలుసు కానీ ధర నిర్ణయించడం తెలీదు” అంది.

అది విన్న  రత్నాంగి “ రాణి గారికి వజ్రాల హారం అసలు విలువ తెలుసు.  మహారాజుకి తన మాట మీద గౌరవం ఎక్కువ ఉందా లేక   తన మీద ప్రేమ ఎక్కువ ఉందా   తెలుసుకోవడానికే అలా  చేసింది. ఆమెకి తెలీకుండా లక్ష వరహాలు చెల్లించడం ద్వారా ఆమె మాట మీద గౌరవం కన్నా ఆమె మీద ప్రేమ ఎక్కువని తెలిసి చాలా  సంతోషించింది. ఒకవేళ రాజు గారు తొంభై వేలు వరహాలతో  ఆగిపోయి ఉంటే  మిగతా పదివేల వరహాలు కలిపి  ఆ హారాన్ని  సొంతం చేసుకునేది.  ఆమె మనసులో మాట నాతో చెప్పింది” అంది. 

“భర్తకి తగిన భార్య. అన్యోన్య దాంపత్యం అంటే వారిదే కదా”  అని సంతోషంగా చెప్పింది  వ్యాపారి భార్య . 
 —-----******-----

No comments:

Post a Comment