"
శక్తి స్వరూపం
సృష్టిని నడిపించేది శక్తి. కంటికి కనిపించకుండా అణువు నుంచి బ్రహ్మాండం దాకా విస్త రించుకుని సకల చరాచర జీవుల మనుగడకు కారకమయ్యేది శక్తి. శక్తి రూపాలు అనూహ్యం. శక్తిని సృష్టించలేం, నశింపజేయలేం. దాన్ని ఒక రూపం నుంచి మరో రూపా నికి మార్చుకుని పనులు సాధించుకోవచ్చు అంటుంది సైన్స్ లౌకిక జీవనవిధానంలో శక్తి, యుక్తి రెండూ అవసరం. మనిషికి శక్తియుక్తులు లేకపోతే జీవిక కష్టం. శక్తి మానవుడితో ఏ పనైనా చేయిస్తే, యుక్తి ఆ పనిని సాధించడంలో మెలకువను అలవర్చుతుంది.
ఆధ్యాత్మికంగా శక్తికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. శక్తి అనుకోగానే స్ఫురణకు వచ్చేది ముష్కరులను మట్టుబెట్టిన అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ. వరాలు పొందిన రాక్షసులను సంహరించడానికి విష్ణువు అవతారధారణ చేస్తే, దేవతలందరూ తమ తమ శక్తులను ఆయుధ రూపేణ ధారపోసి అవతార పురుషుణ్ని తేజోవంతం చేశారు. దుష్ట శిక్షణ సులభసాధ్యమైంది. పార్వతి, కాళి, దుర్గ, ఉమలు జగన్మాత భిన్న రూపాలు. ఒక్కో ప్రయోజనాన్ని ఆశించి ఒక్కొక్క నామ సంకేతం ఏర్పడింది. శివుడు తన పరాప్రకృతి అయిన అతీతస్థితి కారణంగా సృష్టి కార్య నిర్వహణలో క్రియారహితుడిగా ఉండి, తన క్రియాశీలక శక్తిని సతులకు అప్ప గించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు నారీ శక్తులు నడుంకట్టడానికి ఇదే కారణమన్నది ఒక యోగి ఆత్మకథలోని వివరణ.
హిరణ్యకశిపుడిది రాక్షసరాజ్యం. పసి పిల్ల వాడైన ప్రహ్లాదుడు నిత్యం హరినామస్మర ణతో దేవతల ఆగర్భ శత్రువుల మధ్య ఒంట రిగా సంచరించాడంటే, శ్రీహరి తనను ఎక్క డైనా, ఎలాగైనా రక్షించి తీరతాడన్న అచంచల విశ్వాసం. మధుసూదనుడి అప్రమేయ శక్తి మీద అపార నమ్మకం. అందుకే తండ్రి ఎన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నా బాధను ఓర్చుకున్నాడే తప్ప నారాయణ మంత్ర మననాన్ని విడనాడలేదు. బాలుడి భక్తికి పరవశుడైన హరి అనూహ్య శక్తితో పరిసరాలను ప్రకంపింపజేస్తూ, ఉగ్రనరసింహుడిగా స్తంభాన్ని చీల్చుకుని ఉద్భవించి, హిరణ్యకశిపుణ్ని చీల్చి చెండాడాడు. ఆ భీభత్సకాండ అనం తరం ప్రహ్లాదుడి ప్రార్ధనతో నారసింహుడు అంతటి భీకరత్వాన్ని, అతులిత శక్తిస్వ రూపాన్ని విడనాడి శాంతించాడు. రాముడు రాజుగా ఉంటే వేరు. కాని అరణ్య వాసంలో నార దుస్తులు ధరించి ఒక సామాన్యుడిగా భార్యను వెతుకుతున్న సీతాప తికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. అంటే- వాళ్లు రాముడి ధర్మ నిరతిని కనులతో దర్శిస్తూ, రామనామ శక్తిని అనుభవైకవేద్యం చేసుకున్నారు.
ధర్మబద్ధ జీవితం శక్తిమంతం. మానవజన్మ సార్థకతకు రుజువర్తన ఆలంబనం. నిజాయతీగా జీవించే వాళ్లను నిప్పుతో పోలుస్తుంది సంఘం. మాటలో సత్యం, చేతలో పారదర్శకత, నడతలో నీతి ప్రతిఫలించే వ్యక్తిని మానవోత్తముడిగా గుర్తిస్తుంది. అతడు బాహ్య ప్రవర్తనతో, అంతర్గతశక్తితో పదుగురిని ఆకర్షిస్తాడు. అతడు చెప్పేది వేదం. నడిచేదారి అనుసరణీయం. ఆ జన్మ జగత్ కల్యాణ కారకం.
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
No comments:
Post a Comment